AP&TG

తమ తల్లి పేరిట ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలి-ఉప ముఖ్యమంత్రి

2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ..

అమరావతి: ‘భూమిని, పచ్చదనాన్ని కాపాడుకోవడం మన అందరి కనీస బాధ్యత. రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటి, దానిని సంరక్షించాలి.మనం విసిరే ప్రతి విత్తన బంతి ఒక మహావృక్షం కావాలి. ప్రతి చెట్టు వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ఒక రక్షణ కవచంలా మారాలి. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఒక భాగస్వామి కావాలి. మనమందరం కలిసికట్టుగా శ్రమించి పచ్చని, ఆరోగ్యకరమైన, వాతావరణ మార్పులను తట్టుకోగల ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దామ’ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి సమీపంలోని మూలపాడు బటర్ ఫ్లై పార్క్ లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వయం సహాయక బృందాలు, విద్యార్థులు, మూలపాడు గ్రామస్తులతో కలసి పవన్ కళ్యాణ్ సీడ్ బాల్స్ తయారు చేశారు. సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, పొదుపు సంఘాల మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వలంటీర్లతోపాటు రాష్ట్ర ప్రజలు ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *