ఔట్సోర్సింగ్ బృందంలో పనిచేసిన అనుకల్ప్ నేడు ఫార్మ్ హౌస్..
అమరావతి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రధాన నిందితులుగా వున్నారు. ఈ కేసులో అరెస్టు అయిన అనుకల్ప్ మిశ్రా(22) అనే వ్యక్తి ఆస్తులు ఆదాయానికి మించి ఉన్నట్లు గుర్తించారు. సదరు వ్యక్తి ఇటీవల అయోధ్యలో 65 లక్షల ఖరీదైన ఇళ్లు కొన్నాడు.అలాగే తన స్వంత ఊరిలో ఓ ఫార్మ్ హౌస్ నిర్మించుకున్నాడు. దాదాపు లక్షకు పైగా ఖరీదు చేసే ఓ మోటర్ బైక్ తో పాటు మహేంద్ర స్కార్పియోను కూడా అతను బుక్ చేసినట్లు తెలిసింది. బ్యాంకు ఔట్సోర్సింగ్ బృందంలో పనిచేసిన అనుకల్ప్, మూడేళ్ల క్రితం ఆలయ విరాళాల లెక్కింపు బృందంలో చేరాడు. ఆ తర్వాత తన బావమరిది లవ్‌కుశ్ మిశ్రాను కూడా బ్యాంకు ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా అదే బృందంలో నియమించాడు.
అత్యంత విలాసవంతంగా:- కౌశల్పురిలో ఉన్న అనుకల్ప్ నివాసంలో సోదాలు చేపట్టారు. బ్యాంకు రికార్డులు, ప్రాపర్టీ పేపర్లు, ఇతర ఆర్థిక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. అయితే ఇటీవల తన స్వంత ఊరిలో ఓ ధార్మిక కార్యక్రమాన్ని అతను ఏడు రోజుల పాటు అత్యంత విలాసవంతంగా నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత కొన్ని ఏళ్లుగా నిందిత వ్యక్తి కుటుంబ ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడినట్లు స్థానికులు చెప్పారు. అనుకల్ప్ మిశ్రాతో పాటు ఈ కేసులో అరెస్టు అయిన ఇతర నిందితుల ఆస్తులను కూడా స్క్రూటినీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

