అమ్మోనియా గ్యాస్ లీక్-ఇద్దరు మృతి,ఐదుగురి పరిస్థితి విషమం
అమరావతి: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో గ్యాస్ లీక్ అవ్వటంతో ఇద్దరు మరణించగా 46 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం జరిగిన ఘటన వివరాలు ఇలా వున్నాయి… తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా, పెరియపాలెం సమీపంలోని కన్నిగైపైర్‌లో ‘సెయింట్ పీటర్స్ అండ్ పాల్ సీఫుడ్ ఎక్స్ పోర్ట్స్’ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. ఆదివారం యూనిట్‌లో అమర్చిన మెజర్ వాల్వ్ నుండి గ్యాస్ లీక్ జరిగినట్లు సమాచారం. అమ్మోనియాను కొన్ని రకాల ఉత్పత్తులను డీప్ ఫ్రీజ్ చేసేందుకు సీఫుడ్ యూనిట్లలోని కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ లో ఉపయోగిస్తారు.
ఐదుగురి పరిస్థితి విషమం:- సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారు.46 మందిలో ఏడుగురు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులలో ఎక్కువ మంది ఉత్తర భారతదేశానికి చెందిన వారని తెలుస్తోంది. వాంతులు, ఊపిరితీసుకోవటంలో ఇబ్బంది, అలసట సమస్యలు ఉన్న వారిని కూడా పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ విచారం వ్యక్తం చేశారు. గ్యాస్ లీక్‌కు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి విజయ్ ఆదేశించారని, బాధితులందరూ వలస కార్మికులేనని రాష్ట్ర ఐటీ మంత్రి ఆర్. కుమార్ తెలిపారు.
24 గంటల్లోపు మధ్యంతర నివేదిక:- గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ జరిపేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో పారిశ్రామిక భద్రత-ఆరోగ్య శాఖ డైరెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి-ప్రజారోగ్య శాఖ అదనపు డైరెక్టర్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ 24 గంటల్లోపు మధ్యంతర నివేదికను, మూడు రోజుల్లోపు తుది నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.

