INTERNATIONALNATIONALOTHERSSPORTS

2026 వరల్డ్ రోయింగ్ కప్-3లో స్వర్ణ పతకం సాధించిన భారత్ జోడీ

అమరావతి: స్విట్జర్లాండ్‌లోని లూసెర్న్‌ లో జరిగిన 2026 వరల్డ్ రోయింగ్ కప్ IIIలో, లక్ష్య్-ఉజ్జ్వల్ కుమార్ సింగ్ ల జోడీ ఈ ప్రతిష్టాత్మక పోటీలో దేశానికి మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు.ప్రపంచ రోయింగ్ కప్ చరిత్రలోనే భారత్‌కు ఇది తొలి స్వర్ణం కావడం గమర్హం.శనివారం జరిగిన లైట్‌ వెయిట్‌ మెన్స్‌ డబుల్ స్కల్స్ ఫైనల్‌లో భారత్ జోడీ 6:26.09 నిమిషాల్లో రేస్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. హాంకాంగ్‌ (6:27.14), నెదర్లాండ్స్ (6:27.36) తర్వాత స్థానాల్లో నిలిచాయి. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో భారత జోడీ ఆధిక్యాన్ని నిలబెట్టుకుని చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.

బృందంలో 17 మంది ఆర్మీకి చెందిన వారే:- ప్రపంచ రోయింగ్‌ కప్‌ సిరీస్‌లో భారత్‌ ఇప్పటివరకు స్వర్ణ పతకం గెలవలేదు. ప్రపంచ రోయింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు ముందు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ టోర్నీలో తొలి గోల్డ్‌ సాధించడం భారత రోయింగ్‌కు మైలురాయిగా నిలిచింది. ఈ విజయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. స్వర్ణం సాధించిన లక్షయ్, ఉజ్వల్‌ ఇద్దరూ భారత ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న సైనికులే. ఈ టోర్నీలో పోటీపడుతున్న 18 మంది భారత బృందంలో 17 మంది ఆర్మీకి చెందిన వారే కావడం గమనార్హం. మరొకరు నేవీకి చెందిన అథ్లెట్. ఈ సీజన్‌లో వరల్డ్‌ రోయింగ్‌ కప్‌-1 విజేతలైన హాంకాంగ్‌కు చెందిన లామ్‌ సాన్‌ టుంగ్‌, చాన్‌ టిక్‌ లంగ్‌ జోడీతో పాటు ఇతర ప్రత్యర్థులను లక్షయ్-ఉజ్వల్‌ దీటుగా ఎదుర్కొన్నారు. ప్రారంభం నుంచే ఆధిక్యంలో కొనసాగిన భారత జోడీ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొని గెలుపును సొంతం చేసుకుంది.

నిర్మలమైన నది జలాలు,అలాగే ఒలింపిక్ ప్రమాణాలతో కూడిన 2,000 మీటర్ల ఆరు లేన్ల కోర్సు కారణంగా ప్రపంచంలోనే అత్యుత్తమ రోయింగ్ వేదికలలో ఒకటిగా గుర్తింపు పొందిన లూసర్న్‌ లోని ప్రసిద్ధ ‘రోట్‌సీ’ (Rotsee) వద్ద ఈ రెగాట్టా (పడవ పందెం) జరుగుతోంది. జూన్ 26 నుండి జూన్ 28 వరకు మూడు రోజుల పాటు సాగే ఈ పోటీలో ఒలింపిక్ అలాగే పారా-రోయింగ్ ఈవెంట్‌లు ఉంటాయి. ఇందులో సాధించే ఫలితాలు ‘వరల్డ్ రోయింగ్ కప్’ ర్యాంకింగ్స్‌ కు పరిగణనలోకి తీసుకుంటారు.

దేశానికి గర్వకారణం:- ఈ విజయంపై ఆర్మీ రోయింగ్‌ నోడ్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ రామకృష్ణన్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘భారత రోయింగ్‌ చరిత్రలో ఇది చిరస్మరణీయ ఘట్టం.వరల్డ్‌ రోయింగ్‌ కప్‌లో తొలి స్వర్ణ పతకం సాధించిన లక్షయ్, ఉజ్వల్‌ దేశ ప్రతిభను ప్రపంచానికి చాటారు. ఆర్మీ రోయింగ్‌ నోడ్‌లో సంవత్సరాలుగా అందించిన కఠిన శిక్షణ, క్రమశిక్షణకు ఇది నిదర్శనం. ఇది భారత ఆర్మీతో పాటు దేశానికే గర్వకారణం. ఈ విజయం మరెంతో మంది యువతను రోయింగ్‌వైపు ఆకర్షిస్తుందని, భవిష్యత్తులో ఒలింపిక్స్‌ లో భారత్‌కు మరిన్ని విజయాలు అందిస్తారని ఆశిస్తున్నాం” అని అన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *