‘క్రియేటివ్ ఎకానమీ విప్లవం’.. జూలైలో మెగా ఫిల్మ్ వర్క్ షాప్-మంత్రి కందుల దుర్గేష్
అమరావతి: సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర రంగానికి సరికొత్త గ్లామర్, గ్లోబల్ టెక్నాలజీని అద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త ‘క్రియేటివ్ ఎకానమీ’కి తెరలేపింది. ఏపీ యువతలోని సినిమా ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూ, ఫిల్మ్ డెవలప్మెంట్కు అత్యంత ప్రాధాన్యతనిచ్చేలా జూలైలో ‘క్రియేటివ్ ఎకానమీ’పై ఒక వర్క్‌షాప్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
గురువారం సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్‌ను ‘జాడెక్స్ ఇన్నోవిజన్ ప్రైవేట్ లిమిటెడ్’ ఫౌండర్ దివ్య కొనకళ్ల, కో-ఫౌండర్ శశికుమార్ పెయ్యాల మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో క్రియేటివ్ ఎకానమీ, ఫిల్మ్ మేకింగ్‌పై వర్క్ షాప్ నిర్వహించాలన్న వారి వినూత్న ప్రతిపాదనకు మంత్రి దుర్గేష్ సానుకూలంగా స్పందించారు. తద్వారా ఔత్సాహిక చిత్ర నిర్మాతలు, నూతన కళాకారులు, సాంకేతిక నిపుణులు, రచయితలు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు సినిమా నిర్మాణంలోని అత్యాధునిక సాంకేతికతలను పరిచయం చేయడం జరుగుతుందన్నారు. అంతేగాక పరిశ్రమ నిపుణుల పర్యవేక్షణలో వెండితెర అద్భుతాన్ని ఆవిష్కరించే 24 క్రాఫ్ట్స్ లో మెళకువలపై ఈ వర్క్‌షాప్‌లో ప్రత్యేక శిక్షణ ఉంటుందన్నారు. కథాభివృద్ధి, స్క్రీన్ ప్లే, ఏఐ సహాయక చిత్ర నిర్మాణం తదితర అంశాలపై పాల్గొనే వారికి లైవ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తామన్నారు.

