AP&TG

ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఉండాల్సిందే-పవన్ కళ్యాణ్

సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని..

అమరావతి: రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రతిపాదించిన ‘గ్రీనింగ్ సొసైటీ’ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జులై 3వ తేదీ నాటికి ఈ సొసైటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేశారు. గ్రీనింగ్ సొసైటీకి సంబంధించిన నిబంధనలు, నియామకాలు, విధివిధానాల ప్రతిపాదనలన్నీ కచ్చితంగా  ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025కి అనుగుణంగానే ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. గురువారం వెలగపూడి సచివాలయంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఒక నర్సరీ:- ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఒక నర్సరీ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా పంచాయతీలో ఏర్పాటు సాధ్యం కాకపోతే, కనీసం మూడు, నాలుగు పంచాయతీలను ఒక క్లస్టర్‌గా చేసి, ఉమ్మడిగా ఒక నర్సరీ ఉండేలా వెంటనే పనులు ప్రారంభించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వీబీ-జీ రామ్ జీ’ పథకం కిందకు నర్సరీల పెంపకాన్ని కూడా అనుసంధానించాం. ఈ పథకం ద్వారా లభించే నిధులు, ఉపాధి దినాలను సమర్థంగా ఉపయోగించుకుని, గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి” అన్నారు.

సీడ్ బాల్స్ ప్రజా ఉద్యమంలా:- పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చల్లడానికి 2.6 కోట్ల సీడ్ బాల్స్  సిద్ధం చేసినట్లు అటవీ శాఖ అధికారులు పవన్ కళ్యాణ్ కి తెలిపారు. ఈ వర్షాకాలంలోనే వీటిని అటవీ, ఖాళీ ప్రాంతాలలో వెదజల్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. కొండ కోనల్లో విత్తనాలను చల్లడానికి ఈసారి సుమారు 40 నుంచి 50 అత్యాధునిక డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు  వివరించారు. ఈ ప్రణాళికపై స్పందించిన పవన్ కళ్యాణ్, సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం చేయకుండా, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలి. విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలను కలుపుకొని దీనిని ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

అరుదైన మొక్కల సంరక్షణపై అభినందనలు:- రాష్ట్రంలో అంతరించిపోతున్న అరుదైన వృక్ష జాతులను రక్షించేందుకు అటవీ శాఖ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అటవీ శాఖ ఉన్నతాధికారులైన పీసీసీఎఫ్, హెచ్‌ఓఎఫ్‌ఎఫ్ లను, వాళ్ల బృందాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పాములేరు వాగు వెంబడి కేవలం 10 మాత్రమే మిగిలి ఉన్న అత్యంత అరుదైన, అంతరించిపోతున్న వెదురు జాతిని అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయిలో చేసిన లోతైన పరిశోధనలు, ఆధునిక మాలిక్యులర్ సైన్స్ ద్వారా ఈ కొత్త జాతిని గుర్తించారు. దీనికి  ‘బాంబూసా ఆంధ్రీకమ్’  అని నామకరణం చేశారు. ఈ చివరి పది మొక్కలను కాపాడటమే కాకుండా, వాటి సంఖ్యను మరింత పెంచేందుకు అటవీ శాఖ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయడం పట్ల అభినందించారు. అదేవిధంగా, శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే, ప్రస్తుతం అంతరించిపోయే దశకు చేరిన ఈత చెట్టు మాదిరి ఉండే ‘సైకాస్ శేషాచలన్సిస్’  మొక్కల పెంపకానికి, వాటి సంరక్షణకు కూడా అటవీ శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుందని తెలుసుకొని అభినందించారు. కార్యక్రమంలో అటవీ పర్యావరణశాఖల ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్, పీసీసీఎఫ్ పి.వి.చలపతిరావు, అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, సీసీఎఫ్ సోషల్ ఫారెస్ట్, జూలాజికల్ పార్క్స్ బి.ఎన్.ఎన్. మూర్తి, సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ ఎన్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *