AP&TG

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశం

అమరావతి: రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగింది. సమావేశంలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం మొత్తం 37 కీలక ప్రతిపాదనలను ఆమోదించారు.రాజధాని అమరావతి నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, పర్యాటకం, పారిశ్రామిక వృద్ధి, ఉపాధి వంటి రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కేబినెట్ వివరాలను మీడియాకు వెల్లడించారు.

అమరావతి అభివృద్ధి, మౌలిక వసతులు:- రాజధాని పనులు: అమరావతి హైకోర్టు భవన సముదాయం చుట్టూ అంతర్గత రహదారులు, వాటర్ బాడీస్, ప్రీకాస్ట్ ఫిన్స్ నిర్మాణాల కోసం రూ.547.07 కోట్లను కేబినెట్ మంజూరు చేసింది. కృష్ణా నది తీరంలో 6 ఎకరాల్లో ‘అమరావతి ఐ’ ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు:- ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పని చేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

క్వాంటం వ్యాలీ:- రాజధానిని గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మార్చే ‘అమరావతి క్వాంటం వ్యాలీ’ కోసం కేటాయించిన 49.66 ఎకరాల భూమికి రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీల నుండి వంద శాతం మినహాయింపు ఇచ్చింది. అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల నివాసాలలో అత్యాధునిక హోమ్ ఆటోమేషన్ వసతుల కోసం రూ.94.90 కోట్ల ఎల్-1 బిడ్‌కు ఆమోదం తెలిపింది.

భూముల కేటాయింపు:- ల్యాండ్ పూలింగ్ నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్ పాలసీ సవరణలపై చర్చించడంతో పాటు, వైజాగ్ మధురవాడలో స్టార్ హోటళ్లు, రిసార్టుల కోసం ఏపీటీడీసీకి 9.39 ఎకరాల భూమిని బదలాయించాలని నిర్ణయించింది.

పర్యాటకం, విమానయానం, రవాణా రంగం:- విమానయాన రంగాన్ని ఆధునీకరిస్తూ ‘ఏపీ ఏవియేషన్ పాలసీ 2026-31’ని అమెదించారు. టూరిజం అభివృద్ధి కోసం విశాఖపట్నం, చీరాల బీచ్‌లలో పైలట్ ప్రాజెక్ట్‌ గా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే బీచ్ షాక్స్‌ లు తెరిచి ఉంచడానికి అనుమతి ఇవ్వనున్నారు. పరిమిత రకాల మద్యం విక్రయాలకు మాత్రమే అనుమతి ఉండనుంది. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే తదుపరి విస్తరించే అవకాశం ఉంది. ‘

పోర్టులు & ఫైబర్ నెట్:-  గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల అనుసంధానానికి వీలుగా జాతీయ రహదారి-216 నుండి రోడ్డు, రైల్వే లైన్ల నిర్మాణానికి ఏపీ మారిటైమ్ బోర్డుకు భూములు ఇవ్వనున్నారు. అలాగే ఏపీ ఫైబర్‌నెట్ విస్తరణకు హడ్కో నుండి రూ. 300 కోట్ల అప్పు తీసుకునేందుకు వీలుగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది.

ఆరోగ్యం, లీజులు:- ట్రాన్స్‌ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ చట్టం అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.2011 కేంద్ర చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. అవయవ మార్పిడి ప్రక్రియలో పారదర్శకత, వైద్య సదుపాయాల మెరుగుదల లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.  కాకినాడ అర్బన్ పరిధిలో టీడీపీ జిల్లా కార్యాలయానికి 1.45 ఎకరాల ప్రభుత్వ భూమిని 66 ఏళ్ల లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. అగ్రిగోల్డ్ కేసుల విచారణ వేగవంతం చేయడానికి అదనంగా 21 పోస్టులను మంజూరు చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *