ఆదివారం నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం-విపత్తుల నిర్వహణ సంస్థ
పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు..
అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో కూడిన విభిన్న వాతావరణ పరిస్థితులు మరో రెండు రోజులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఆదివారం నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందన్నారు.
శనివారం గరిష్ట ఉష్ణోగ్రతలకు అవకాశం:- పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 45 – 46 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
గరిష్ట ఉష్ణోగ్రతలు 43 – 44 డీగ్రీలు:- విజయనగరం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 – 44 డీగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.
గరిష్ట ఉష్ణోగ్రతలు 40 – 42 డీగ్రీలు:- శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 40 – 42 డీగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు:- నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉందని, దీనిప్రభావంతో శని, ఆదివారాల్లో అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

