సైబర్ నేరాల్లో తక్షణ స్పందన-నియంత్రణా వ్యవస్థపై సీఎం చంద్రబాబు సమీక్ష
గోల్డెన్ అవర్ ఫండ్ రికవరీపై దృష్టి..
అమరావతి: సైబర్, ఆర్ధిక నేరాల నియంత్రణపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేరాల ద్వారా బాధితుల సొమ్మును రాబట్టేందుకు గోల్డెన్ అవర్ ఫండ్ రికవరీ టెక్నాలజీలపై దృష్టి పెట్టాలని పోలీసు అధికారులు, బ్యాంకింగ్ అధికారులకు సూచనలు ఇచ్చారు. సచివాలయంలో బుధవారం సైబర్ నేరాల్లో తక్షణ స్పందన-ఏపీలో నియంత్రణా వ్యవస్థలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆర్ధిక నేరాలకు పాల్పడే సైబర్ నేరగాళ్లు ఇతరుల బ్యాంక్ ఖాతాలను వినియోగించకుండా చేపట్టే చర్యలు, గోల్డెన్ అవర్ ఫండ్ రికవరీ, ఏపీ సైబర్ పాలసీ తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. ఏపీలో సైబర్ నేరాలు, ఆర్ధిక నేరాలు జరగకుండా బ్యాంకులు తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై రిజర్వు బ్యాంకును సంప్రదించాలని సీఎం సూచించారు. ఈ సైబర్, ఆర్ధిక నేరాల్లో ఖాతాదారుల ప్రయోజనాలు రక్షించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
సైబర్ ఫ్రాడ్స్ నుంచి రక్షణకు టెక్నాలజీ టూల్స్… UPI పేమెంట్స్ ద్వారా మిలియన్ల సంఖ్యలో ఆర్ధిక లావాదేవీలు క్షణాల్లో జరుగుతున్నాయని ఈ నేపథ్యంలో గోల్డెన్ అవర్ ఫండ్ రికవరీ అంశంపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ అంశంపై మరిన్ని రిజర్వు బ్యాంకు తీసుకువచ్చిన మ్యూల్ ఆకౌంట్ హంటర్ AI లాంటి టూల్స్ ను నకిలీ ఖాతాలను గుర్తించేందుకు వినియోగించాలన్నారు.
విజయవాడ, విశాఖ, తిరుపతిలలో సైబర్… ఏపీలో సైబర్, ఆర్ధిక నేరాలకు సంబంధించి 9.29 లక్షల కాల్స్ బాధితుల నుంచి 1930 టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదులు వచ్చినట్టు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు. సైబర్, ఆర్ధిక నేరాల బారిన పడి ఏపీలో ఇప్పటి వరకూ రూ.652 కోట్లను బాధితులు కోల్పోయినట్టు తెలిపారు. సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం-బ్యాంకర్లతో కలిసి రూ.116 కోట్ల పైచిలుకు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లకు చేరకుండా కాపాడగలిగామని తెలిపారు. సైబర్, ఆర్ధిక నేరాల నియంత్రణ కోసం రాష్ట్ర స్థాయిలో సీఐడీ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ పని చేస్తోందని.. విజయవాడ, విశాఖ, తిరుపతిలలో సైబర్ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రికి వివరించారు.

