ఇకపై ప్రజా ప్రతినిధులు-అధికారులు ఉమ్మడిగా పీజీఆర్ఎస్
ప్రతీ శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డే..
అమరావతి: అర్జీలు, ఫిర్యాదులు పరిష్కారంలో ఎలాంటి అలక్ష్యం చూపొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొందరు కలెక్టర్లు అర్జీలు తీసుకుని కారులోనే పడేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, అలా జరగ్గకూడదని సీఎం స్పష్టం చేశారు. శుక్రవారం 7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజున వివిధ అంశాలపై సమీక్షించారు. ఫైళ్ల క్లియరెన్స్.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, డేటా లేక్, అవేర్, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”E- ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి రావడం మంచి పరిణామం. పెద్దమొత్తంలో ఫైళ్లు వచ్చినా సరాసరి 10 గంటల వ్యవధిలో ఫైళ్లను డిస్పోజ్ చేసిన సీఎస్ సాయి ప్రసాద్‌ను అభినందిస్తున్నా.
పీజీఆర్ఎస్ కోసం ప్రజా దర్బార్లు:- పీజీఆర్ఎస్ కోసం ప్రజాదర్భార్ లాంటి ఓ వేదికను ఏర్పాటు చేయబోతున్నాం. ఫిర్యాదులు స్వీకరించే సమయంలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. సింగపూర్ లో ఇదే రకంగా ఫిర్యాదుల పరిష్కారం జరుగుతోంది. మండల స్థాయిలోనూ పీజీఆర్ఎస్ విధానంలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించటం ద్వారా ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవియన్స్ స్వీకరిస్తున్నట్టే… ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో గ్రీవియన్స్ స్వీకరించాలి. ప్రతీ శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డేగా నిర్ణయిచాం. సమస్యలు పరిష్కారమైతే బ్రాండ్ రావటంతో పాటు ప్రజల్లో విశ్వాసం పెరగటం ముఖ్యం. కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు… పిటిషన్లకు పరిష్కారం చూపాలి. ప్రతీ నెలా ఒక నియోజకవర్గాన్ని నాలుగు సార్లు సందర్శించాలి. సమస్యల పరిష్కారానికి గుడ్ విల్ మిషన్ గా కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లాలి. అన్ని వీడియో కాన్ఫరెన్సులను కూడా ఒకరోజుకు పరిమితం చేద్దాం.”అని ముఖ్యమంత్రి అన్నారు.

