పోలీంగ్ స్టేషన్లలో ఫింగర్, ఐరిస్ బయోమెట్రిక్స్ అనుసరించవచ్చా-సుప్రీంకోర్టు
అమరావతి: ఎన్నికల సమయంలో దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలీంగ్ స్టేషన్లలో ఫింగర్, ఐరిస్ బయోమెట్రిక్స్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో లాయర్ ఆశిష్ కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జోయ్మాల్యా బాగ్చీ స్పష్టం చేశారు.అయితే, తదుపరి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకంటే ముందే బయోమెట్రిక్ అనుసరించడం సమంజసమేనా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ విషయమై భారత ఎన్నికల సంఘంతో పాటు కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేశారు. మొదట ఈ పిటిషన్‌పై విచారణ జరపటానికి ధర్మాసనం అంగీకరించలేదు. ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వెళ్లమని పిటిషనర్‌కు న్యాయమూర్తులు సూచించారు. తాను ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడటం లేదని పిటిషనర్ తెలిపారు. దీంతో న్యాయమూర్తులు పటిషన్‌పై విచారణకు అంగీకరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో బయోమెట్రిక్ విధానాన్ని అనుసరించవచ్చా లేదా అన్నదానిపై పరిశీలన చేయాలన్నారు.
ఎన్నికల విశ్వసనీయత:-ఓటింగ్ ప్రక్రియలో అవినీతి, అనుచితల ప్రభావం, నకిలీ, డూప్లికేటు ఓట్లు వంటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఇవి ఎన్నికల స్వచ్ఛత, విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయని తెలిపారు.ఈలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల కోసం బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టే అధికారం ఈసీకి ఉందని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ ధృవీకరణ ఉంటే నిజమైన ఓటర్లు మాత్రమే ఓటు వేయగలరని చెప్పారు.

