రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డకునేందుకు ఆరు మొబైల్ టీమ్స్-జె.సి మొగిలి వెంకటేశ్వర్లు
పీడీ యాక్ట్..
నెల్లూరు: జిల్లాలో పీడీఎస్ (PDS) రైస్ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని, దాన్ని పూర్తిగా అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టిందని జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా రెండు డిస్ట్రిక్ట్ లెవల్ ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, అలాగే నెల్లూరు అర్బన్ ప్రాంతంలో ఆరు మొబైల్ టీమ్స్ ను రెండు షిఫ్ట్ లలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
బయట నుంచి జిల్లాలోకి కానీ:- ఈ టీమ్స్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక షిఫ్ట్ గా, సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మరో షిఫ్ట్‌గా 24 గంటల పాటు నిరంతరంగా విధులు నిర్వహిస్తాయన్నారు. ప్రతి టీమ్‌లో పోలీస్ శాఖకు చెందిన సీఐ, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ క్యాడర్ సిబ్బంది, సివిల్ సప్లయిస్ శాఖకు చెందిన సిఎస్డీటీ, రెవెన్యూ శాఖకు చెందిన వీఆర్వోలను సమన్వయంతో ఏర్పాటు చేసినట్లు వివరించారు.జిల్లా నుంచి బయటకు గానీ, బయట నుంచి జిల్లాలోకి గానీ పీడీఎస్ రైస్ అక్రమంగా రవాణా జరగకుండా అడ్డుకోవడమే ఈ మొబైల్ టీమ్స్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా మరిన్ని మొబైల్ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఎవరైనా రేషన్ తీసుకోకపోతే:- రేషన్ కార్డు దారులందరూ తమకు అర్హత మేరకు కేటాయించిన రేషన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని ఈ సందర్భంగా జేసి కార్డుదారులకు సూచించారు. ఎవరైనా రేషన్ తీసుకోకపోతే, ఆ స్టాక్ డీలర్ వద్దే క్లోజింగ్ బ్యాలెన్స్‌గా ఉంటుందని, తదుపరి నెలలో ఆ మిగులు స్టాక్‌ను మిగతా కార్డు దారులకు డ్రా చేయడం జరుగుతుందన్నారు. దళారీలు లేదా ఇతరులు పీడీఎస్ రైస్ అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడితే, వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ (PD Act) కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

