పెట్టుబడులకు, ప్రగతికి… ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
పెట్టుబడిదారులు రాష్ట్రానికి, ప్రజలకు ఏం చేస్తారనేది మా ప్రాధాన్యం..
సింగపూర్ తరహాలో సమష్టి శ్రమతో విజయం సాధ్యం..
పరిశ్రమలు మొదటి రోజు నుంచే పర్యావరణం మీద దృష్టిపెట్టాలి..
అనుమతులు, ప్రోత్సాహకాల విషయంలో..
అమరావతి ‘గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి ఉండేది. రాష్ట్రంలో మీరు పరిశ్రమ పెడితే.. మాకేమిస్తారు..? అని అడిగే విష సంస్క్రతి అప్పట్లో ఉండేది. కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు రాష్ట్రాన్ని స్వర్గధామంగా మారుస్తోంది. మీరు పెట్టుబడులుపెడితే రాష్ట్రానికి ఏం ఇస్తారు..? ప్రజలకు ఏం చేస్తారు అని అడిగి సత్సంప్రదాయంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోంద’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ జేఎన్టీయూలో సోమవారం జరిగిన సీఐఐ ప్రాంతీయ సదస్సుకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కాకినాడలో తొలిసారి సీఐఐ ప్రాంతీయ సదస్సు:- ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… పరిశ్రమలకు రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయి. వాటిని అందిపుచ్చుకొని, ఆంధ్రప్రదేశ్ పురోగతిలో పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.‘‘విశ్రాంత ఉద్యోగుల ప్యారడైజ్ నగరంగా భావించే కాకినాడలో తొలిసారి సీఐఐ ప్రాంతీయ సదస్సు జరగడం ఆనందంగా ఉంది. విశాఖపట్నం తర్వాత రాష్ట్రంలో రెండో ప్రాంతీయ సదస్సుకు కాకినాడ వేదిక కావడం గొప్ప మైలురాయి. కాకినాడ పారిశ్రామిక ప్రగతి చరిత్రలో రూ.6,347 కోట్ల పెట్టుబడులు రావడం కొత్త అవకాశాలకు పునాది వేస్తుంది. ఈ ప్రాంతం మరింత పురోగతి చెందడానికి ఇది ఇంధనంగా పని చేస్తుంది.
18 వేల మందికి ఉపాధి:- 16 ఎంఓయూల ద్వారా రూ.4,652 కోట్లు పెట్టుబడులు, రూ.2,090 కోట్లతో పూర్తయిన 4 ప్రత్యేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరగడం శుభసూచకం. ఈ ప్రాజెక్టుల ద్వారా కాకినాడ, చుట్టుపక్కల ప్రాంతాల్లో 18 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇది యువతకు ఉపాధి భరోసాను ఇవ్వడంతోపాటు ఎన్నో కుటుంబాలకు ఓ ఆసరాను చూపించే గొప్ప కార్యక్రమంగా నిలిచిపోతుందన్నారు.

