AP&TGDISTRICTS

వర్చువల్‌గా నెల్లూరులో సర్వేపల్లి కట్ట ఇళ్ల పట్టాల పంపిణీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

939 పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు..

సంక్రాంతిలోగా నెల్లూరులో మరో 4,000 ఇళ్ల పట్టాలు..

అమరావతి: దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ, వారి సొంతింటి కలను సాకారం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నెల్లూరులోని సర్వేపల్లి కట్టలో 22.31 ఎకరాల భూమిపై 939 కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం అమరావతిలోని క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. సుమారు రూ.600 కోట్ల విలువైన ఆస్తిపై పేదలకు హక్కులు కల్పించామని తెలిపారు. మొత్తం లబ్ధిదారుల్లో 701 మంది మహిళలు ఉండటం మహిళా సాధికారతకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేసి, ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి పేదలకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం 28 నెలల పాలనలో ఆచరణలో చూపిస్తోందన్నారు.

నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో మంత్రి పి నారాయణ, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. మంత్రి నారాయణ లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలను స్వయంగా అందజేశారు. దశాబ్దాల నిరీక్షణకు తెరదించి పట్టాలు అందించిన ముఖ్యమంత్రికి మంత్రి నారాయణ, ఇంకా లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమకు ఎంతో తోడ్పాటునిస్తున్నాయని తెలిపారు. లబ్ధిదారుల ఆనందానికి హద్దులు లేవని మంత్రి నారాయణ ముఖ్యమంత్రికి వివరించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *