AP&TG

గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి-ఉప ముఖ్యమంత్రి

అడవితల్లి బాట 2.0 ద్వారా రూ.2,052 కోట్లతో 2,569 పనులకు శ్రీకారం..

పార్టీ రంగుల కోసం వందల కోట్ల ఖర్చు చేసింది..

రహదారులు,ఉపాధి, వైద్య సదుపాయాలు..

అమరావతి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు అండగా నిలిచి, వారి విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.పార్టీ కోసం, కూటమి కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం లభించేలా కూటమిలోని ప్రతి నాయకుడు అండగా నిలవాలని కోరారు. ఆదివారం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కాకవాడలో అడవితల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు.

ఏ ఒక్కరూ పదవులూ ఆశించలేదు:- ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ “2014లో కూటమికి మద్దతుగా నిలిచినప్పుడు ఏ ఒక్కరూ పదవులూ ఆశించలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావించి నిస్వార్థంగా పని చేశారు. పార్టీ కోసం, కూటమి కోసం తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి ఎన్నో త్యాగాలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ మన పార్టీ నాయకులకు, వీరమహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం వుందన్నారు.  

అడవితల్లి బాట లక్ష్యం:- గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయాలు కల్పించి, వాటిని అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం కింద 858 గిరిజన ఆవాసాలకు 1,662 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి రూ.1,406 కోట్లతో పనులు చేపట్టాం. ఇదే స్ఫూర్తితో అడవితల్లి బాట 2.0 ద్వారా మరో 1,341 ఆవాసాలకు 1,976 కిలోమీటర్ల మేర రహదారులు, 45 వంతెనల నిర్మాణం కోసం రూ.2,052 కోట్లతో మొత్తం 2,569 పనులను మంజూరు చేశామని తెలిపారు.

83 వేల మంది రైతులకు లబ్ధి:- గిరిజన కుటుంబాలకు స్థిరమైన ఆదాయాన్ని కల్పించి, వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఉద్యానవనాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉపాధి హామీ, వీబీ-జీ రామ్ జీ పథకాల ద్వారా గిరిజన ప్రాంతాల్లో 85 వేల ఎకరాల్లో ఉద్యానవనాలను అభివృద్ధి చేసి, సుమారు 83 వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చాం అన్నారు.

నాణ్యతలో లోపాలు కనిపిస్తే వాటిని మా దృష్టికి:- మనం నిర్మిస్తున్న రహదారులు నాణ్యతతో ఉన్నాయా లేదా అని పరిశీలించాల్సిన బాధ్యత కూడా స్థానిక ప్రజలపై ఉంది. కేవలం రోడ్లు వేయించడమే కాదు, అవి నాణ్యతతో నిర్మితమై, ఎక్కువకాలం ప్రజలకు ఉపయోగపడేలా చూడాలి. ఎక్కడైనా నాణ్యతలో లోపాలు కనిపిస్తే వాటిని మా దృష్టికి తీసుకురండి. రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నదే మా లక్ష్యం. తప్పును ప్రశ్నించే ధైర్యం ప్రజలకు ఉండాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను కూడా గుర్తించాలి. ధైర్యంగా ఉండాలి, బాధ్యతగా వ్యవహరించాలి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి” అన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *