AP&TGDISTRICTS

బాధ్యతాయుత జర్నలిజంతో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాలి-జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

జర్నలిస్టులకు నిరంతర శిక్షణ ఎంతో అవసరం..

ప్రజా ప్రయోజనమే వార్తకు ప్రధాన గీటురాయి ..

సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్..

నెల్లూరు: ప్రజా సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాస్తవాలను ధృవీకరించిన అనంతరం బాధ్యతాయుతంగా వార్తలను అందించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా జర్నలిస్టులకు సూచించారు. శనివారం జడ్పి సమావేశ మందిరంలో సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని జర్నలిస్టులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో మొదటి రోజు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మీడియా గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావడం వల్ల వాటి పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.

వార్తలలో వాస్తవ నిర్ధారణకు ప్రాధాన్యం:- సోషల్ మీడియా, డిజిటల్ మీడియా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వార్తలను వేగంగా అందించడంతో పాటు, వాటి వాస్తవాలను నిర్ధారించుకోవడం మరింత ముఖ్యమని కలెక్టర్ అన్నారు. వార్తను ప్రచురించే ముందు సంబంధిత అంశాన్ని మరోసారి పరిశీలించి, వాస్తవాలు, సందర్భం, ప్రజా ప్రయోజనం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

ప్రజా ప్రయోజనమే వార్తకు ప్రధాన గీటురాయి: సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్

సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజా సమస్యలను సమర్థవంతంగా వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రజా ప్రయోజనానికి సంబంధించిన సమాచారాన్ని బాధ్యతాయుతంగా అందించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో సమాచార శాఖ డిడి వేణుగోపాల్ రెడ్డి, సి.ఆర్ మీడియా అకాడమి ఓ ఎస్ డి జీవన్, రిసోర్స్ పర్సన్స్, జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *