పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ,సీ.ఎం చంద్రబాబు
అమరావతి: ఏ.పి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కల్యాణ్ ఎంతో ప్రజాదరణ పొందిన నాయకుడని ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం అందిస్తోన్న సుపరిపాలనను ముందుండి నడిపిస్తున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ సమాజ సేవలో నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు:- మిత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో, అభివృద్ది కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నారు. గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. మార్పును ఆవిష్కరిస్తున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణం విషయంలో ప్రజలకు కూటమి ఇచ్చిన మాటను నిజం చేసేలా అనునిత్యం పనిచేస్తున్న పవన్ కల్యాణ్ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకునేలా ఆశీర్వదించాలని ఆ దేవదేవుడిని ప్రార్దిస్తున్నాను అని పేర్కొన్నారు.
అభిమానుల కోలాహలం:– పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, జనసైనికులు, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలతో అభిమానులు ఈ రోజును పండుగలా నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఆయన రాష్ట్ర పురోగతికి మరింత శక్తివంతంగా పనిచేయాలని కోరుకుంటున్నారు.

