నెల్లూరు మైనింగ్‌పై చైనా ‘డౌ’ పెత్తనం-ఎంపీ వేమిరెడ్డి కనుసన్నల్లోనే దోపిడీ-మాజీ మంత్రి అనిల్ కుమార్
– చైనా జాతీయుడితో కలిసి వీపీఆర్ మైనింగ్ సిండికేట్..
– సిండికేట్ దౌర్జన్యంతో రూ.200 కోట్లకు పైగా అక్రమ వసూళ్లు..
– మూతపడిన 49 క్వార్ట్జ్ మైన్లు.. రోడ్డున పడ్డ వేలాది కార్మికులు..
– దేవాదాయ శాఖ భూముల్లోనూ ఆగని అక్రమ తవ్వకాలు..
– ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పాలి..
– నా ఆరోపణలు అబద్ధమైతే సీబీఐ విచారణకు సిద్ధమా?
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ మైనింగ్ వ్యవస్థను ‘డౌ’ అనే ఒక చైనా జాతీయుడు శాసిస్తున్నాడని, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (VPR) అండదండలతోనే ఈ ముఠా దందా నడుస్తోందని YSRCP PAC మెంబర్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మల్టీ ఎలిమెంట్’ కంపెనీకి చెందిన ‘డౌ’ అనే చైనీయుడు స్థానిక మైనింగ్ సిండికేట్‌ను గుప్పిట్లో పెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. తమ కంపెనీకే క్వార్ట్జ్ మెటీరియల్ ఇవ్వాలని, లేకపోతే అధికారుల ద్వారా మైన్లు బ్లాక్ చేయిస్తానని లోకల్ మైన్ ఓనర్లను తీవ్రంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. వీపీఆర్ అండ చూసుకునే ఆ చైనీయుడు ఇంతలా రెచ్చిపోతున్నాడని, అసలు ‘డౌ’తో స్థానిక నాయకుడు వీపీఆర్‌కు ఉన్న సంబంధం ఏమిటో ఎంపీ తక్షణమే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఒక చైనా వ్యక్తి ఇక్కడికొచ్చి మన వ్యవస్థను శాసించడం కచ్చితంగా దేశద్రోహమేనని, ఇది మన దేశ భద్రతకు కూడా ముప్పని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
స్థానిక నేత వీపీఆర్ అండదండలతోనే ఈ చైనా వ్యక్తి సిండికేట్ నడుపుతూ, లీగల్ మైన్ ఓనర్ల నుంచి టన్నుకు 8 వేల నుంచి 15 వేల రూపాయల వరకు కప్పం వసూలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఫినీ క్వార్ట్జ్ పేరుతో నడుస్తున్న ఈ సిండికేట్ గత రెండేళ్ల వ్యవధిలోనే సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా అక్రమ వసూళ్లకు పాల్పడిందని వివరించారు. వీరి దౌర్జన్యాలకు తలొగ్గని కారణంగా జిల్లాలోని 147 లీజుల్లో 49 మైన్లను ఉద్దేశపూర్వకంగా మూసివేయించారని, దీంతో ఒక్కో మండలంలో సుమారు 3 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కనుసన్నల్లోనే 2000 సంవత్సరాల పురాతనమైన సిద్ధుల కోన ఆస్తులను సైతం వదలకుండా అక్రమంగా ఫెల్స్ పార్ మైనింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని సవాల్ విసిరిన అనిల్ కుమార్ యాదవ్, చైనా జాతీయుడి ఆగడాలపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.
మేము చాలా సత్యహరిశ్చంద్రులం:– ఈ కూటమి ప్రభుత్వంలో మైన్ ఓనర్లు పడుతున్న ఇబ్బందులు, దారుణాలను ఆధారాలతో బయటపెట్టడానికే నేను మళ్లీ మీ ముందుకు వచ్చాను. మేము చాలా సత్యహరిశ్చంద్రులం, అవినీతి రహిత పరిపాలన చేస్తున్నాం అని ఈ కూటమి ప్రభుత్వం చెబుతోంది. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు, వాస్తవానికి తన సిండికేట్ ద్వారా ఉన్న సంపదను ఆవిరి చేసే కార్యక్రమం చేస్తున్నారు.
డౌ బ్లాక్ మెయిల్.. రూ. 200 కోట్ల దోపిడీ:– చైనాకు డిమాండ్ తగ్గి క్వార్ట్జ్ ఎగుమతులు ఆగిపోలేదు. కేవలం సిండికేట్ దురాశ వల్లే ఆదాయం తగ్గింది. అన్నీ లీగల్‌గా ఉన్న మైన్ ఓనర్ల దగ్గరికి వెళ్లి టన్నుకు రూ. 8,000 నుంచి రూ. 15,000 వరకు సిండికేట్ దౌర్జన్యంగా వసూలు చేస్తోంది. గత రెండేళ్ల వ్యవధిలోనే మైన్ ఓనర్లను పిండి, ఈ సిండికేట్ దాదాపు రూ. 200 కోట్లకు పైగా అక్రమంగా వసూలు చేసిన మాట వాస్తవం కాదా అని నేను సూటిగా అడుగుతున్నా. రాష్ట్రవ్యాప్తంగా 147 క్వార్ట్జ్ లీజులు ఉంటే, అందులో కేవలం 98 మాత్రమే ఓపెన్ చేశారు. మిగతా 49 మైన్లను వీరికి కప్పం కట్టలేదన్న ఒకే ఒక్క కారణంతో ఉద్దేశపూర్వకంగా మూసేశారు.
ఎంపీ వీపీఆర్ తో డౌ కు ఉన్న సంబంధం: – మల్టీ ఎలిమెంట్ కంపెనీకి చెందిన డౌ అనే చైనా జాతీయుడు ఇక్కడ సిండికేట్ నడుపుతూ ఆంధ్రాలో మైనింగ్‌ను శాసిస్తున్నాడు. ఒక చైనా వాడు ఇక్కడికొచ్చి దౌర్జన్యం చేయడం కచ్చితంగా దేశద్రోహమే, మన దేశ భద్రతకు కూడా ముప్పే. తమ కంపెనీకే మెటీరియల్ ఇవ్వాలని, లేకపోతే డిపార్ట్మెంట్ ద్వారా మైన్లు బ్లాక్ చేయిస్తానని ఆ చైనా వ్యక్తి మన లోకల్ మైన్ ఓనర్లను తీవ్రంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆ చైనీయుడు డౌకి స్థానిక నాయకుడు వీపీఆర్ గారికి ఉన్న సంబంధం ఏంటి? వీపీఆర్ అండదండలతోనే ఈ దందా నడుస్తోందని డౌ చెబుతున్నాడు, దీనికి ఎంపీగా ఉన్న వీపీఆర్ సమాధానం చెప్పాలి. ఫినీ క్వార్ట్జ్ పేరుతో విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సిండికేట్ నడుస్తోంది. ఆఫీసు సన్‌షైన్ మెడోస్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నెం.101లో ఉంది. ఇదంతా ఎవరి కనుసన్నల్లో జరుగుతుందో అందరికీ తెలుసు.
కార్మికుల పొట్టకొట్టారు.. దేవుడి మాన్యాలను వదల్లేదు:– వీరి సిండికేట్ వసూళ్ల వల్ల ఒక్కో మండలంలో కనీసం 3 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. జేసీబీలు, కార్లు కొన్న ఓనర్లు ఈఎంఐలు కట్టలేక రోడ్డున పడ్డారు. దేవాదాయ శాఖ మంత్రి కనుసన్నల్లోనే 2000 సంవత్సరాల పురాతన సిద్ధుల కోన శివుడి కొండను ఆక్రమించి అక్రమంగా ఫెల్స్పార్ మైనింగ్ చేస్తున్నారు. దీనిపై ఎంక్వైరీ చేయమని దేవాదాయ మంత్రికి లేఖ రాసినా అధికారులకు దిక్కులేదు. మా ప్రభుత్వంలో 4 లక్షల టన్నుల ఫెల్స్పార్ మైనింగ్ జరిగితే, ఈరోజు మీ పిండుడు దెబ్బకి అది కేవలం 1,48,000 టన్నులకు పడిపోయింది. ఆ వ్యాపారం నెల్లూరులో పూర్తిగా కనుమరుగైపోయింది. చిన్న స్థాయిలో వ్యాపారం చేసుకునే దాదాపు 352 చిన్న ఎం.డి.ఎల్ లను ఎందుకు బ్లాక్ చేశారు? ఫైన్లు కట్టించుకుని వదిలేయాల్సింది పోయి, ఉద్దేశపూర్వకంగా వాళ్ల పొట్టకొట్టారు.
దమ్ముంటే CBI విచారణకు ఆదేశించండి:– నేను చెబుతున్నది తప్పైతే దమ్ముంటే సీబీఐ విచారణ వేయండి. ఈ చైనా వాడి ఆగడాలపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకు కచ్చితంగా ఫిర్యాదు చేస్తాను. దౌర్జన్యాలు ఆపకపోతే నా దగ్గర ఉన్న వాట్సాప్ చాట్లు, చైనా ట్రిప్ ఫోటోలు, వాయిస్ రికార్డింగ్‌లు అన్నీ బయటపెడతా. ఇప్పటికైనా దోపిడీ ఆపి మైన్ ఓనర్లను ప్రశాంతంగా వ్యాపారం చేసుకోనివ్వండని ప్రభుత్వాన్ని కోరారు.

