AP&TG

అడవిలో ప్రతి కదలికపై నిఘాకు అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్-ఉప ముఖ్యమంత్రి

నూతనంగా నిర్మిస్తున్న అరణ్యారామం..

అరణ్యానికి సాంకేతిక రక్షణ కవచం..

కర్ణాటక నమూనా అటవీ పరిరక్షణ..

అడవిని పరిరక్షించేందుకు ఆధునిక సాంకేతిక వ్యవస్థ..

ఈ-గస్తు తరహా మొబైల్ యాప్‌..

అమరావతి: కర్ణాటక అటవీ శాఖ అనుసరిస్తున్న తరహా అత్యాధునిక సాంకేతిక పరిపాలనా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రతి అంగుళం అటవీ భూమిని సంరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న అరణ్యారామంలో కర్ణాటక తరహా అధునాతన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ వ్యవస్థ ద్వారా అడవుల మ్యాపింగ్‌తోపాటు పూర్తి స్థాయిలో వన్యప్రాణుల కదలికలు, అటవీ కార్యకలాపాలపై డిజిటల్ నిఘా ఏర్పాటు చేయాలన్నారు.

అడవిలో ప్రతి అణువును కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించే విధంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు పట్ల పవన్ కళ్యాణ్ ఆసక్తి కనబర్చారు. జియో-స్పేషియల్ డ్యాష్‌బోర్డ్, డ్రోన్ ఆధారిత పర్యవేక్షణ, కెమెరా ట్రాప్‌ల ద్వారా వన్యప్రాణుల సంఖ్యపై ఎప్పటికప్పుడు విశ్లేషణ, అటవీ మార్గాల్లో ప్రయాణించే వాహనాల ట్రాకింగ్, గస్తీ పర్యవేక్షణ, అటవీ అగ్నిప్రమాదాలు, మానవ-వన్యప్రాణి ఘర్షణల పర్యవేక్షణ తదితర కార్యక్రమాలన్నింటినీ ఒకే చోటు నుంచి పర్యవేక్షించే వెసులుబాటు కలుగుతుందని అభిప్రాయపడ్డారు.

సత్వర పరిహారం అందించేలా:- వన్యప్రాణుల వల్ల అటవీ సరిహద్దు గ్రామాల్లో జరిగే పంటల నష్టానికి పరిహారం చెల్లించే ప్రక్రియను కూడా డిజిటలీకరణ ద్వారా మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని, తద్వారా పంటల నష్టంపై నివేదికలు, రైతులకు పరిహారం చెల్లింపుల వ్యవస్థలో మరింత పారదర్శకత వస్తుందని పేర్కొన్నారు. వేగంగా పరిహారం చెల్లించే వెసులుబాటు కలుగుతుందన్నారు. జీఐఎస్ ఆధారిత ధృవీకరణ వ్యవస్థను తక్షణం అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.

అటవీ సరిహద్దులకు చట్టబద్ధమైన భద్రత:- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గనిర్దేశకత్వంలో, అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నాయకత్వంలో ఇప్పటికే అటవీ సరిహద్దుల డిజిటలైజేషన్ ప్రక్రియను రాష్ట్రంలో కూడా చేపట్టిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. తద్వారా అటవీ సరిహద్దుల చట్టబద్ధతను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు హనుమాన్ ద్వారా ఇప్పటికే మానవ-వన్యప్రాణుల ఘర్షణల నివారణ, విశ్లేషణ వ్యవస్థలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఏఐ ఆధారిత ప్రమాద అంచనా వ్యవస్థలు, వన్యప్రాణుల సంచారానికి సంబంధించిన డ్యాష్‌బోర్డులు సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *