పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు 17 టీఎంసీల నీరు తరలింపు-సీఎం చంద్రబాబు
ప్రకాశం బ్యారేజ్ వద్ద సీఎం…
అమరావతి: ప్రకాశం బ్యారేజ్ లో గోదారి నీటి పరవళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. పట్టి సీమ ద్వారా కృష్ణమ్మకు వస్తున్న గోదావరి నీటిని ముఖ్యమంత్రి తిలకించారు. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని తిరిగి నివాసానికి వెళుతున్న సమయంలో బ్యారేజ్ పై కొద్దిసేపు తన వాహన కాన్వాయ్ నిలిపిన ముఖ్యమంత్రి గోదావరి నీటితో నిండు కుండలా ఉన్న బ్యారేజ్ ను పరిశీలించారు. గోదావరి నీటితో బ్యారేజ్ నిండుగా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోందని సీఎం ఈ సందర్భంగా అన్నారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్ లో ఇప్పటి వరకు 17.52 టిఎంసిల నీటిని కృష్ణా నదికి తరలించినట్లు అధికారులు వివరించారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కారణంగా గోదావరి నది నుంచి ఇప్పటి వరకు 521 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్లు అధికారులు తెలిపారు. పట్టి సీమ ప్రాజెక్టు ద్వారా సమృద్దిగా గోదావరి జలాలు వస్తున్న నేపధ్యంలో ప్రకాశం బ్యారేజి దిగువన వివిధ కాలువల ద్వారా డెల్టాలోని పంటలకు నీటిని విడుదల చేస్తున్నామని సీఎం అన్నారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువ నుంచి 3928 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ నుంచి 3115 క్యూసెక్కులు, గుంటూరు చానల్ నుంచి 115 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. డెల్టాకు నీటి సరఫరా కోసం మొత్తం కాలువలకు 7,158 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. ఎల్ నినో కారణంగా తీవ్ర వర్షాబావ పరిస్థితుల్లో పట్టిసీమ నీరు పంటలకు జీవం పోస్తోందని ఈ సందర్భంగా సీఎం అభిప్రాయ పడ్డారు. సమర్థ నీటి నిర్వహణ ద్వారా ఎల్ నినో పరిస్థితుల్లో సాగునీటి ఇబ్బందుల్ని అధిగమించేందుకు అన్ని విధాలా పనిచేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

