AP&TG

ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు ప్రకటించిన ఎస్.ఈ.సి

పట్టణ స్థానిక సంస్థలకు 1న పోలింగ్‌, నవంబర్….

నవంబర్ 5న పోలింగ్.. 6న రీపోలింగ్.. 7న ఓట్ల లెక్కింపు..

పోలింగ్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో మార్పులు..

88 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రెండో సాధారణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. తొలుత నవంబర్ 3న నిర్వహించాల్సిన పోలింగ్‌ను నవంబర్ 5కు వాయిదా వేసింది. అవసరమైతే నవంబర్ 6న రీపోలింగ్ నిర్వహించనుండగా, నవంబర్ 7న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా ఓ ప్రకటన విడుదల చేశారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌, ఓట్ల లెక్కింపు తేదీల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. యథావిధిగా నవంబర్​ 1న పోలింగ్‌, నవంబర్​ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని పేర్కొన్నారు. అక్టోబర్ 28న సవరించిన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు.

పోలింగ్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో మార్పులు:- రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 19న రెండో సాధారణ MPTC,ZPTC ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను అక్టోబర్ 27న మధ్యాహ్నం 3 గంటల తర్వాత సంబంధిత రిటర్నింగ్ అధికారులు ప్రచురించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానాల ఫలితాలను కూడా ఇదే రోజు ప్రకటించారు. మరోవైపు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 3వ తేదిన జరగనుంది. అదే రోజున ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించాల్సి ఉండటంతో పోలీసు, పోలింగ్ సిబ్బంది అందుబాటులో ఉండటంపై సమస్య తలెత్తింది. రెండు ఎన్నికల కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు షెడ్యూల్‌ను సవరించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

తుఫాను ప్రభావిత పరిస్థితులపై సమీక్ష:- రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తుఫాను ప్రభావిత పరిస్థితుల నేపథ్యంలో కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం చర్చించింది. పరిస్థితులను సమీక్షించిన అనంతరం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ను వాయిదా వేయాల్సిన అవసరం లేదని నిర్ణయించింది. దీంతో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నవంబర్ 1, 2026న యథావిధిగా జరగనుంది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్……..

సవరించిన ఎన్నికల షెడ్యూల్:- పోలింగ్: నవంబర్ 5, 2026-ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు.

*రీపోలింగ్ (అవసరమైతే): నవంబర్ 6, 2026 — ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు.

*ఓట్ల లెక్కింపు: నవంబర్ 7, 2026 — ఉదయం 8 గంటల నుంచి.

*ఫలితాల ప్రకటన: ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే.

88 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగింపు:- అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 10 మండలాల్లో 44 పోలింగ్ కేంద్రాలు, పోలవరం జిల్లాలోని 7 మండలాల్లో మరో 44 పోలింగ్ కేంద్రాలు కలిపి మొత్తం 88 కేంద్రాల్లో పోలింగ్ ముగింపు సమయాన్ని ముందుగానే నిర్ణయించారు. ఈ కేంద్రాల్లో పోలింగ్ సాయంత్రం 5 గంటలకు బదులుగా మధ్యాహ్నం 3 గంటలకే ముగుస్తుంది. అవసరమైతే రీపోలింగ్ కూడా మధ్యాహ్నం 3 గంటలకే ముగియనుంది. సవరించిన ఎన్నికల షెడ్యూల్‌పై విస్తృత ప్రచారం కల్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఈ షెడ్యూల్‌ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 243K, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994లోని సంబంధిత నిబంధనలు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ (ఎన్నికల నిర్వహణ) నియమాలు–2006 ప్రకారం జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *