అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఆర్థిక సాయం..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డి.ఎన్.డి అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేని స్థితిలో, మంచానికే పరిమితం అయిన యువ అభిమాని కోరికను మన్నించి స్వయంగా అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆర్థిక భరోసాతోపాటు భగవంతుని తీర్థప్రసాదాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం హనుమకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ కి చెందిన 17 ఏళ్ల నిరంజన్ అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడు. తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్ ని కలవాలని అభిలషించారు. తెలంగాణ జనసేన నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు బుధవారం స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లారు. అతన్ని దగ్గరకు తీసుకుని పరామర్శించారు. తల్లిదండ్రులు రాంగోపాల్, శ్రీమతి మానసతో మాట్లాడి నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యం ఎక్కడ చేయిస్తున్నారు? అతన్ని కాపాడుకోవడానికి ఏం చేయొచ్చు అన్న విషయాలపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని భగవంతుడి ఆశీస్సులు బాబుకి ఉంటాయని చెప్పి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం నింపారు. శ్రీ వెంకటేశ్వరస్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ. లక్ష ఆర్ధిక సాయం అందజేశారు. నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ విఖ్యాత భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేయిస్తానని తెలిపారు.
కుటుంబ జీవనోపాధికి క్యాంటీన్:- ఈ సందర్భంగా నిరంజన్ తల్లిదండ్రులు వృత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటిన్లో పని చేసేవారమని చెప్పగా, వారి జీవనోపాధి మెరుగుపర్చేందుకు క్యాంటిన్ పెట్టించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకి దిశానిర్దేశం చేశారు.

