టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర
అథారిటీ పదవీకాలం ఏడాది పాటు..
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పదవీకాలం ముగియడంతో, టీటీడీ సాధికారిక మండలి (స్పెసిఫైడ్ అథారిటీ) ఛైర్మన్‌గా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద జరిగిన కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఛైర్మన్‌కు వేదాశీర్వచనం అందించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ముద్దాడ రవిచంద్ర శ్రీవారి ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ, దేవుని సేవ చేసేందుకు ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, సీ.ఎం చంద్రబాబు నాయుడుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం టీటీడీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా, మెరుగైన రీతిలో కొనసాగించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ మనసును పూర్తిగా స్వామివారిపై లగ్నం చేసేలా అవసరమైన అన్ని ఏర్పాట్లను టీటీడీ కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. భక్తులకు అన్ని విధాలా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ నిర్వహిస్తున్న ఇతర 64 ఆలయాల్లోనూ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు.
ట్రస్ట్ బోర్డు అధికారాలు:– నూతనంగా నియమించిన ఈ స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) ముద్దాడ రవిచంద్ర చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆర్థిక శాఖ కార్యదర్శి వి.వినయ్ చంద్, దేవాదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబులను ఇందులో సభ్యులుగా నియమించారు. ఈ అథారిటీ పదవీకాలం ఏడాది పాటు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఈలోపు కొత్త ట్రస్ట్ బోర్డును నియమిస్తే, వెంటనే ఈ స్పెసిఫైడ్ అథారిటీ రద్దవుతుందని ఉత్తర్వుల్లో వివరించింది. అలాగే, ట్రస్ట్ బోర్డుకు ఉండే అధికారాలు, విధులు అన్నీ ఈ స్పెసిఫైడ్ అథారిటీకి ఉంటాయని స్పష్టం చేసింది.

