AP&TG

అక్రమ ఇసుక తవ్వకాలు, ఖనిజాల రవాణాపై ఉక్కుపాదం-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ..

అధికారుల బాధ్యతలు ఖరారు చేసిన ప్రభుత్వం..

ఫిర్యాదు అందిన మూడు రోజుల్లో సంయుక్త తనిఖీలు..

ప్రతి 15 రోజులకు జిల్లా స్థాయి టాస్క్‌ ఫోర్స్ సమీక్ష..

30 రోజుల్లో ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ ఇసుక తవ్వకాలు, ఖనిజాల అక్రమ తవ్వకాలు, అనధికార రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ అక్రమాలను నియంత్రించేందుకు వివిధ శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు సమగ్ర మధ్యంతర మార్గదర్శకాలను జారీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు వెలువరించారు.

అక్టోబర్ 1న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నవంబర్ 3న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. గనులు, రెవెన్యూ, పోలీసు, అటవీ, జలవనరులు, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో చర్చించి అక్రమ తవ్వకాల నియంత్రణకు బాధ్యతలను ఖరారు చేశారు.

ఇసుక అక్రమాలపై 2,113 కేసులు నమోదు:- గత రెండేళ్లలో ఇసుక అక్రమాలకు సంబంధించి 2,113 కేసులు నమోదు చేసి రూ.6.24 కోట్ల జరిమానా విధించారు. 117 వాహనాలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడంతో పాటు 21 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. చిన్న ఖనిజాల అక్రమాలకు సంబంధించి 2024-25 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు 9,120 కేసులు నమోదు చేసి రూ.340.9 కోట్ల జరిమానా విధించారు.

మూడు పని రోజుల్లో:- కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ, అటవీ, నదీ పరివాహక, జలవనరుల భూముల్లో ఆయా శాఖల అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి. అక్రమ తవ్వకాలు గుర్తించిన వెంటనే ఫిర్యాదు కోసం ఎదురుచూడకుండా చర్యలు ప్రారంభించాలి. పత్రికలు, టీవీలు, డిజిటల్ మీడియా, హెల్ప్‌లైన్, విజిలెన్స్ యాప్, ప్రజల వినతుల ద్వారా వచ్చే ఫిర్యాదులను ప్రత్యేక కేసు నంబరుతో నమోదు చేయాలి. ఫిర్యాదు అందిన మూడు పని దినాల్లో భూమి వివరాలు, యాజమాన్య హక్కులు, భౌగోళిక కోఆర్డినేట్లను సంబంధిత శాఖలు అందించాలి. గనులు, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి అదే గడువులో నివేదిక సమర్పించాలి.

జరిమానాలను రెవెన్యూ రికవరీ చట్టం:- అక్రమ తవ్వకాలు నిర్ధారణ అయితే తవ్విన ఖనిజాల పరిమాణం, ప్రభుత్వ ఆదాయానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి జరిమానాలు విధించాలి. అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు అవసరమైతే బ్లాక్‌లిస్ట్‌ లో చేర్చాలి. నిందితులపై కేసులు నమోదు చేసి, చెల్లించని జరిమానాలను రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేయనున్నారు.

కలెక్టర్లు బాధ్యులపై చర్యలు:- అధికారుల నిర్లక్ష్యం వల్ల అక్రమ తవ్వకాలు జరిగినట్లు తేలితే జిల్లా కలెక్టర్లు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. తనిఖీలకు వెళ్లే అధికారులకు పోలీసు రక్షణ కల్పించాలని, నేరాలు నిర్ధారణ అయినప్పుడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి టాస్క్‌ ఫోర్స్‌ ను క్రియాశీలం చేయనున్నారు. ఈ కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై కేసులు, చర్యలు, పెండింగ్ వ్యవహారాలను సమీక్షిస్తుంది. ప్రతి కేసుకు బాధ్యుడైన అధికారితో పాటు చర్యలు పూర్తి చేయాల్సిన గడువును కూడా నమోదు చేయాలి.

30 రోజుల్లో ప్రత్యేక ఆన్‌లైన్:- ఫిర్యాదుల నమోదు నుంచి కేసుల పురోగతి వరకు అన్ని వివరాలను పర్యవేక్షించేందుకు 30 రోజుల్లో ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డును కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. వివిధ శాఖలు 15 రోజుల్లో తమ సూచనలు అందించాల్సి ఉండగా, నవంబర్ నెలాఖరులో మరోసారి సమావేశమై సమగ్ర మార్గదర్శకాలను రూపొందించనున్నారు. ప్రభుత్వ ఆదేశాలను అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *