AP&TG

ఆగష్ఠు నెలలోనే వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు- జలవనరుల శాఖ మంత్రి

పూర్తి కావొచ్చిన టిబిఎం తొలగింపు పనులు..

రెండు విడతల్లో నిర్వాసితులకు 600 కోట్ల పరిహారం..

మిగిలిన పనులు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్..

అమరావతి: ఫ్లోరైడ్‌ బాధిత, వెనుకబడిన ప్రకాశం జిల్లాకు మూడు దశాబ్దాల కలగా ఉన్నవెలిగొండ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ఆగష్టు నెలలోనే కృష్ణా జలాలు తీసుకెళ్ళేందుకు చర్యలు వేగవంతం చేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును 2026 ఆగస్టు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని 2024లోనే నిర్దేశించుకున్నామని, ఆ లక్ష్యానికి అనుగుణంగా గత రెండేళ్లలో దాదాపు రూ.3,000 కోట్లు వెచ్చించి రాత్రింబవళ్లు పనులు చేపట్టామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోని వివిధ పనులు 90 నుంచి 99 శాతం వరకు పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రాజెక్టు లో మిగిలిన పనుల పురోగతిపై అధికారులు, ఏజెన్సీలతో శుక్రవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించి, నిర్ణీత గడువులోగా అన్ని పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి తెలిపారు.

టన్నెల్ పనులు శరవేగంగా:- కొల్లంవాగు నుంచి కృష్ణా జలాలు టన్నెల్‌కు చేరే అప్రోచ్ ఛానెల్ పనులు పూర్తయ్యాయని, హెడ్ రెగ్యులేటర్‌కు సంబంధించిన గేట్ల పనులు కూడా పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు. టన్నెల్–1, టన్నెల్–2లకు సంబంధించిన 286 మీటర్ల సిసి లైనింగ్ పనులను ఈ నెల 18వ తేదీలోగా పూర్తి చేసేలా, ఐదు గ్యాంట్రీలతో ప్రత్యేక షెడ్యూల్ రూపొందించినట్లు తెలిపారు. వెలిగొండ టన్నెల్‌లో ఉన్న 1,900 మెట్రిక్ టన్నుల బరువు, 175 మీటర్ల పొడవు కలిగిన TBM మిషన్‌లో ఇప్పటికే 70 శాతం వరకు తొలగింపు పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. మిగిలిన 30 శాతం పనులను కూడా రాబోయే 7 నుంచి 10 రోజుల్లో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఐతే 5 ఏళ్ళ గొడ్డలి పార్టీ పాలనలో టిబిఎం ను అంగుళం కూడా కదపలేదని, చుక్కనీరు కూడా బయటకు వెళ్ళే పరిస్దితి లేదని, అయినా కూడా జాతికి అంకితం పేరుతో ప్రజల్ని మోసం, దగా చేశారని దుయ్యబట్టారు.

ఫీడర్ కెనాల్ పనుల్లో గణనీయమైన పురోగతి:- 100 క్యూసెక్కుల నీరు వస్తేనే బండ్ లు తెగిపోయే పరిస్దితి ఉన్న ఫీడర్ కెనాల్ ను బలోపేతం చేసేలా, ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.460 కోట్లు మంజూరు చేసి, ఈ ఏడాది జనవరిలో పనులకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే 5.3 కిలోమీటర్ల సీసీ వాల్ పనులు పూర్తయ్యాయని, మొత్తం 11 కిలోమీటర్ల లైనింగ్ పనులను 5 నెలల్లో పూర్తి చేసినట్లు చెప్పారు. ఫీడర్ కెనాల్‌కు సంబంధించిన ఈస్ట్రన్ మెయిన్ కెనాల్, సుంకేసుల, గొట్టిపడియ రెగ్యులేటర్ల పనులను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *