INTERNATIONALNATIONALOTHERS

ఇరాన్ ​vs ఇజ్రాయెల్- అమెరికా-పశ్చిమాసియా సంక్షోభం

విమాన సర్వీసులపై కేంద్రం అలర్ట్..

అమరావతి: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై పడే ప్రభావంపై కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్​ నాయుడు శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డీజీసీఏ, ఇతర భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రయాణికుల భద్రత, విమాన కార్యకలాపాల కొనసాగింపుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమాసియాలో గగనతల ఆంక్షలు, నోటమ్స్​  జారీ అయిన నేపథ్యంలో, ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు, రియల్​టైమ్​ సమన్వయం చేసుకునేందుకు ఈ సమీక్ష సమావేశం నిర్వహించినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఓసీఏ) తెలిపింది.

విమాన సర్వీసులు రద్దు​: పశ్చిమాసియాలో ఇరాన్​ వర్సెస్​ ఇజ్రాయెల్​, అమెరికాల మధ్య భీకరంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, సిబ్బంది భద్రత రీత్యా ఎయిర్ ఇండియా తన విమాన సర్వీసులన్నింటినీ నిలిపివేసింది. మరోవైపు దుబాయ్, జెడ్డా, దోహా, అబుదాబి, దమ్మామ్, బహ్రెయిన్, షార్జా, కువైట్, రస్ అల్-ఖైమా నగరాలకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఇండిగో తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకే తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఇండిగో స్పష్టం చేసింది. వాస్తవానికి భారత్​తోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, టర్కీ సహా పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్, దోహా వంటి అంతర్జాతీయ విమాన విమానాశ్రయాల్లోనే భారీ సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఖతార్ గగనతలం మూసివేతతో, ఖతార్ ఎయిర్​వేస్- దోహాకు వెళ్లే సర్వీసులను తాత్కాలికంగా ఆపేసింది. లెబనాన్, సిరియా, ఇరాక్, ఇరాన్,జోర్డాన్ దేశాలకు సోమవారం వరకు విమానాలను నిలిపివేసినట్లు టర్కిష్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. లండన్ నుంచి దుబాయ్‌కి వెళ్లే విమానాలను వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్​లైన్స్ రద్దు చేసింది. డచ్ విమానయాన సంస్థ కేఎల్ఎం ఆదివారం నుంచి టెల్ అవీవ్‌కు విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఒకవేళ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మరింత ముదిరితే, రానున్న రోజుల్లో మరిన్ని విమాన సంస్థలు సర్వీసులను నిలిపివేసే అవకాశం ఉంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *