మైపాడురోడ్డు జాఫర్ సాహెబ్ కాలువ ప్రాంతంలో 200 దుకాణాలను ఏర్పాటు-కమిషనర్ సూర్యతేజ
“స్మార్ట్ స్ట్రీట్ బజార్”లు..
నెల్లూరు: వీధి వ్యాపారుల సంక్షేమానికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ధేశాల మేరకు నగరంలో ప్రయోగాత్మకంగా “స్మార్ట్ స్ట్రీట్ బజార్” ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ తెలియజేశారు. టౌన్ వెండింగ్ కమిటీ చైర్మన్ అధ్యక్షునిగా కమిషనర్ ఆధ్వర్యంలో సభ్యులతో సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని వీధి వ్యాపారులకు మెరుగైన జీవనోపాధి వసతులు కల్పించేందుకు పట్టణ పురపాలక శాఖా మంత్రి నారాయణ ఆలోచనల మేరకు స్థానిక సత్యనారాయణపురం మైపాడు రోడ్డు జాఫర్ సాహెబ్ కాలువ ప్రాంతంలో 200 దుకాణాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. మూవబుల్ కంటైనర్ లలో ఒక కంటైనర్ లో 4 షాపుల నిర్మాణం, సోలార్ విద్యుత్ కనక్షన్లు, ప్రాంగణంలో ఆహ్లాదకరమైన పచ్చదనం, పార్కింగ్ సౌకర్యం, కంటైనర్లపై కూర్చుని ఆహార పదార్థాలు తినే హోటల్ లాంటి సౌకర్యం, ఉచిత వైఫై సౌకర్యం, సెల్ఫీ పాయింట్ నిర్మాణం, త్రాగునీరు,మరుగుదొడ్లు, అందమైన వీధి దీపాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేనున్నామని వివరించారు.
కంటైనర్ లో ఒక దుకాణం పొందేందుకు మెప్మా విభాగం ద్వారా 2 లక్షల రూపాయలను రుణం అందించనున్నామని తెలిపారు. పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఔత్సాహిక వ్యాపారస్తులు దరఖాస్తులు చేసుకోవచ్చని, పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తామని కమిషనర్ తెలిపారు. వీధి వ్యాపారుల ఆర్థిక అభివృద్ధి, భద్రతల కోసం రూపొందించిన టౌన్ వెండింగ్ కమిటీ ద్వారా అవసరమైన అన్ని చర్యలను వేగవంతంగా పూర్తి చేసి ప్రాజెక్టును త్వరగా అందుబాటులోకి తేవాలని కమిషనర్ సూచించారు.