అమరావతి చాంపియన్షిప్-2026 నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలి-డీఆర్వో
నెల్లూరు: అమరావతి చాంపియన్షిప్-2026 క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అమరావతి చాంపియన్షిప్-2026 నిర్వహణపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం డీఆర్ఓ విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అమరావతి చాంపియన్షిప్-2026లో జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావడానికి అన్ని శాఖలు సమష్టిగా కృషి చేయాలన్నారు. అండర్-17, అండర్-23 బాలురు, బాలికల విభాగాల్లో మొత్తం 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు. జూలై 15 నుంచి 25 వరకు నియోజకవర్గ స్థాయి ఎంపిక పోటీలు, జూలై 26 నుంచి ఆగస్టు 10 వరకు జిల్లా స్థాయి అంతర్-నియోజకవర్గ పోటీలు, ఆగస్టు 20 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు, ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొనేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని, విద్యాశాఖ, యువజన సేవల శాఖ, క్రీడా శాఖ సంయుక్తంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

