సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి-సమాచార హక్కు చట్టం కమిషనర్
నెల్లూరు: సమాచార హక్కు చట్టాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమర్థవంతంగా అమలు చేసి, దరఖాస్తుదారులకు నిర్ణీత గడువులోగా సమాచారాన్ని అందించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ ఒంటేరు రవి బాబు సూచించారు. సోమవారం నెల్లూరు నగరంలోని చెముడుగుంట జెడ్పీ హైస్కూల్, పంచాయతీ కార్యాలయం, విక్రమ సింహపురి యూనివర్సిటీ, విద్యుత్ భవన్, డీఈఓ కార్యాలయం, జిల్లా పరిషద్, డిపివో, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా కోర్టు, జిల్లా రిజిస్ట్రార్, డియంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, డిఎస్పీ, కలెక్టరేట్, తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అమలుపై ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే కీలకమైన చట్టమని పేర్కొన్నారు. చట్టం కింద అందిన దరఖాస్తులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించి, దరఖాస్తుదారులకు పూర్తి సమాచారాన్ని అందించడం ప్రతి ప్రజా సమాచార అధికారి బాధ్యత అని తెలిపారు.
ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజా సమాచార అధికారి (PIO), మొదటి అప్పీలేట్ అధికారి వివరాలను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా బోర్డు ప్రదర్శించాలని సూచించారు. సమాచార హక్కు చట్టానికి సంబంధించిన రిజిస్టర్లను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ సక్రమంగా నిర్వహించాలని, చట్టంలోని నిబంధనల మేరకు స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారాన్ని కార్యాలయ నోటీస్ బోర్డులు, వెబ్సైట్లలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

