CRIMENATIONAL

టెలిగ్రామ్ అసాంఘి,ఉగ్రవాద ముఠాలకు అడ్డగా మారింది-కేంద్రం ప్రభుత్వం

అమరావతి: కేంద్రం ఇటీవల ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్‌ను “కొత్త డార్క్ వెబ్”గా పేర్కొంటూ ఈ రోజు ఒక అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఉగ్రవాదం, బాలల లైంగిక వేధింపుల సామగ్రి (CSAM), ఆర్థిక మోసాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నీట్-యూజీ పరీక్ష కుంభకోణాల వంటి వ్యవస్థీకృత మోసాల సిండికేట్‌లు, తీవ్రవాద గ్రూపులు చట్టం నుంచి తప్పించుకోవడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.ప్రతిష్ఠాత్మక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, పంపిణీకి టెలిగ్రామ్ ఛానళ్లు వేదికగా మారాయని ప్రభుత్వం పేర్కొంది. ఇది దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోందని తెలిపింది.

నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డేటా ప్రకారం, టెలిగ్రామ్ వేదికగా జరుగుతున్న సైబర్ మోసాలపై ఫిర్యాదులు భారీగా పెరిగాయి. హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు దొంగిలించిన డేటాను విక్రయించడానికి, మనీ లాండరింగ్ కోసం ‘మ్యూల్ బ్యాంక్ ఖాతాల’ను కొనుగోలు చేయడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను వాడుతున్నారని కోర్టుకు తెలిపింది.

ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద గ్రూపులు తమ భావజాలాన్ని ప్రచారం చేసేందుకు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా పౌర సమాజంలో అల్లకల్లోలం సృష్టించడానికి టెలిగ్రామ్ గ్రూపులను వాడుకుంటున్నాయని తెలిపింది.

మాల్వేర్, కమాండ్ అండ్ కంట్రోల్ హబ్: కొన్ని ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్లు బాధితుల డేటాను దొంగిలించడానికి టెలిగ్రామ్‌ను కమాండ్ అండ్ కంట్రల్ ప్లాట్‌ ఫామ్‌గా వాడుకుంటున్నాయి. గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ ను బైపాస్ చేసే టూల్స్, నకిలీ ఫైనాన్స్ యాప్‌ల రూపంలో ఉండే మాల్వేర్‌లను ఇక్కడ బహిరంగంగానే ప్రకటిస్తున్నారని కేంద్రం కోర్టుకు తెలియచేసింది. గతంలో లీకైన డేటాబేస్‌ల ఆధారంగా పౌరుల మొబైల్ నంబర్లు, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డుల వివరాలు, సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసేలా టెలిగ్రామ్ బోట్లు(Bots) పనిచేస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది.

టెలిగ్రామ్‌లో ఉన్న మితిమీరిన ప్రైవసీ ఫీచర్లు నేరగాళ్లకు రక్షణ కవచాలుగా మారాయని కేంద్రం అఫిడవిట్‌లో వివరించింది. వినియోగదారులు తమ ఫోన్ నంబర్లు, టెలిగ్రామ్ ఐడీలను దాచుకునే సదుపాయం ఉండటం వల్ల, నేరాల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించడం పరిశోధనా సంస్థలకు అత్యంత క్లిష్టంగా మారుతోందని కోర్టుకు వెల్లడించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *