110 మంది సచివాలయాల VROలకు గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1 VROలుగా పదోన్నతులు-కలెక్టర్
నెల్లూరు: ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ప్రతి ఉద్యోగి విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లావ్యాప్తంగా వీఆర్వో గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1కు పదోన్నతులు పొందిన 110 మంది సచివాలయాల వీఆర్వోలకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డిఆర్ఓ విజయ్ కుమార్ నియామక ఉత్తర్వులను అందజేశారు.
విధుల్లో ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా నిజాయితీగా, పారదర్శకంగా ప్రజలకు సేవ చేయాలని కలెక్టర్ హితవు పలికారు. ప్రస్తుతం వేగవంతమైన సమాజంలో చిన్న తప్పు చేసినా వెంటనే ప్రజల్లో దోషులుగా నిలబడే పరిస్థితి ఉందని, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగి సమాజం తక్కువగా చూసే పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాసులు, తాసిల్దార్ డానియల్ పీటర్ తదితరులు పాల్గొన్నారు.

