ఇంటర్ పరీక్షల్లో 12 సంవత్సరాల తరువాత అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించిన విద్యార్దులు
అమరావతి: రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ విడుదల చేశారు. ఫలితాల కోసం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in/ ను సంప్రదించాలని సూచించారు. Hi’ మెసేజ్‌ను 9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో పంపితే కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
ఇంటర్ ఫస్టియర్‌లో 5,10,307 మంది, సెకండియర్‌లో 5,05,609 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో మొదటి సంవత్సరంలో 77 శాతం, ద్వితీయ సంవత్సరంలో 81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత 12 సంవత్సరాల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించారని నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.
ఏపీ ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. జిల్లాలో 92 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఆటు తర్వాత వరుసగా గుంటూరులో 88 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 87 శాతం ఉత్తీర్ణులయ్యారు. అన్నమయ్య జిల్లాలో అత్యల్ప ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఈ జిల్లాలో కేవలం 62 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.
మే 21 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు:- ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21వ తేదీన ప్రారంభం కానున్నాయి. జూన్ 4వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఇంటర్ ప్రాక్టికల్స్ జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగుతాయి.

