AP&TGMOVIESOTHERS

తెలుగు నాటక రంగానికి పూర్వవైభవం తెస్తాం-మంత్రి కందుల దుర్గేష్

ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు..

అమరావతి: ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు  కందుల దుర్గేష్ తెలుగు నాటక రంగ లోకానికి, కళాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ నాటక రంగాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తోందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటిస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. గత ప్రభుత్వం విస్మరించిన ప్రతిష్టాత్మక ‘కందుకూరి వీరేశలింగం పంతులు’ పురస్కారాలను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించిందని, ఏప్రిల్ 16న తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా ఒక పర్యాయం అర్హులైన కళాకారులకు, రచయితలకు, సాంకేతిక నిపుణులకు అందజేసిందని ఆయన గుర్తుచేశారు. త్వరలోనే మరో దఫా కందుకూరి పురస్కారాలు అందిస్తామని స్పష్టం చేశారు. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఆ దిశగా కసరత్తు మొదలైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, స్వయంగా కళాకారుడైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలో కళలకు, కళాకారులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. నాటకం అనేది కేవలం వినోదం మాత్రమే కాదని, అది సామాజిక మార్పుకు ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకమని అభివర్ణించారు.

కళాక్షేత్రాలను:- రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉన్న కళాక్షేత్రాలను, ఆడిటోరియంలను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించాలని భావిస్తున్నామని, తద్వారా కళాకారులకు మెరుగైన వేదికలు, ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాటక పరిషత్తులను ప్రోత్సహించడం ద్వారా మరుగున పడిపోతున్న పౌరాణిక, చారిత్రక, జానపద నాటకాలను, కళారూపాలను పునరుద్ధరించేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.నాటకం అనేది సమాజానికి అద్దం పట్టే కళ అని పేర్కొంటూ వరల్డ్ థియేటర్ డే  సందర్భంగా ఈ కళాకారుల ప్రతిభను గుర్తించి, వారిని ఆర్థికంగా నిలబెట్టడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *