బియ్యం అమ్మే వ్యాపారులు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి-సంయుక్త కలెక్టర్
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు..
ఒకే రకమైన బియ్యానికి వేర్వేరు ధరలు…?
జిల్లాలో సుమారు 750 మంది బియ్యం వ్యాపారులు..
నెల్లూరు: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అనుగుణంగానే బియ్యం విక్రయించాలని,,ప్రతి బియ్యం అమ్మకందారు తప్పనిసరిగా జిల్లా పౌర సరఫరాల శాఖ నుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు పొందాలని సంబంధిత వ్యాపారులకు జిల్లా సంయుక్త కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. (బియ్యం విక్రయించే హోల్సేల్, రిటైల్ వ్యాపారులు అందరూ తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు నెంబరు 18, తేదీ.20.11.2026 ను జారీ చేసి వున్న నేపధ్యంలో),, సంయుక్త కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని రైస్ మిల్లర్లు, బియ్యం హోల్సేల్-రిటైల్ వ్యాపారులు, బిగ్ చైన్ రిటైలర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఇందుకోసం food-stock.dftd.gov.in పోర్టల్ ద్వారా తమ దుకాణాలకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేసి అనుమతులు పొందాలని సూచించారు. అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వ ఫుడ్ స్టాక్ పోర్టల్లో వ్యాపారులు తమ వద్ద ఉన్న నిల్వల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో సుమారు 750 మంది బియ్యం వ్యాపారులు ఉన్నారని, నిల్వల పరిమితులకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఆ పరిమితులు ఈ విధంగా ఉన్నాయి:
రైస్ మిల్లర్లు – 400 టన్నులు….జిల్లా కేంద్రంలోని హోల్సేల్ వ్యాపారులు 500 క్వింటాళ్లు.
గ్రామీణ ప్రాంతాల్లోని హోల్సేల్ వ్యాపారులు 250 క్వింటాళ్లు…రిటైల్ వ్యాపారులు – 50 క్వింటాళ్లు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు:- పై పరిమితులకు మించి ఎవరూ తమ వద్ద బియ్యం నిల్వలు ఉంచరాదని స్పష్టం చేశారు. మిల్లర్లు, వ్యాపారులు తమ కొనుగోలు వివరాలను ప్రతి రోజూ సాయంత్రం సంబంధిత పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు, వారి వద్ద ఉన్న నిల్వలను స్వాధీనం చేసుకుని గోదాములకు తరలిస్తామని హెచ్చరించారు.
ఒకే రకమైన బియ్యానికి వేర్వేరు ధరలు:- అదేవిధంగా, ప్యాకింగ్ చేసిన బియ్యం సంచులపై ప్రభుత్వం నిర్ణయించిన ధరలను గరిష్ఠ చిల్లర విక్రయ ధర (MRP)గా ముద్రించాలని సూచించారు. ఒకే రకమైన బియ్యాన్ని కేవలం బ్రాండ్ పేరు లేదా బ్రాండ్ విలువ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరకు విక్రయించరాదని స్పష్టం చేశారు. అనవసరంగా ధరలు పెంచడం, ఒకే రకమైన బియ్యానికి వేర్వేరు ధరలు వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడరాదని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి, నెల్లూరు, లీగల్ మెట్రాలజీ శాఖ అధికారి, సహాయ సరఫరాల అధికారి, నెల్లూరు, పౌర సరఫరాల శాఖ ఉప తహసీల్దార్లు, జిల్లాలోని రైస్ మిల్లర్లు, బియ్యం హోల్ సేల్-రిటైల్ వ్యాపారులు, బిగ్ చైన్ రిటైలర్ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

