‘ఐఐటీ-ఖరగ్‌పుర్’ దేశానికి అవసరమైన ఇంజనీర్లను అందించింది-ప్రధాని మోదీ
సవాళ్లనే సవాల్ చేసే మనిషినని..
విద్యార్థులకు, దేశానికీ ఎంతో కీలకం..
అమరావతి: సాంకేతిక విద్య, పరిశోధన, ఆవిష్కరణలకు మార్గదర్శకంగా 1951లో ప్రారంభమైన ఐఐటీ ఖరగ్‌పూర్ దేశంలోనే తొలి ఐఐటీగా పేరుగాంచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.శనివారం దేశంలోనే తొలి ఐఐటీ అయిన పశ్చిమబెంగాల్ లోని ‘ఐఐటీ- ఖరగ్‌పుర్’ ప్లాటినం జూబ్లీ వేడుకలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ప్రసంగిస్తూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. తొలినాళ్లలో పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన ఇంజనీర్లను అందించిందని,ఆ తర్వాత అంతరిక్ష పరిశోధనలు, అణుశక్తి రంగాల్లోనూ దేశానికి సేవలందించిన ప్రతిభావంతులను తీర్చిదిద్దిందని కొనియాడారు. సమాచార సాంకేతిక రంగం విస్తరించిన తర్వాత సాఫ్ట్ వేర్ పరిశ్రమ అభివృద్ధిలోనూ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థులు కీలక పాత్ర పోషించారని ప్రశంసల జల్లు కురిపించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ కంపెనీలకు నాయకత్వం వహించే వరకూ ఐఐటీ పూర్వ విద్యార్థులు ఎదిగారని కొనియాడారు.
సవాళ్లనే సవాల్ చేసే వ్యక్తిని,, అలా సవాల్ చేయడాన్ని తాను ఎన్నడూ ఆపలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒకప్పుడు స్వాతంత్ర్య సమరయోధుల నిర్బంధ శిబిరం ఉన్న ప్రాంతంలోనే ఐఐటీ ఖరగ్‌పుర్‌ను నిర్మించారు. 75 ఏళ్ల ప్రయాణంలో ఈ ఐఐటీ ఎన్నో మైలురాళ్లను చేరింది. దేశాభివృద్ధిలో, ఆవిష్కరణలలో ఐఐటీ ఖరగ్‌పూర్ కీలకపాత్ర పోషిస్తున్నదని ప్రధాని తెలిపారు. గత పన్నెండేళ్లలో ఎన్నో అవకాశాలకు ద్వారాలు తెరిచామని, పేద ప్రజలను శక్తిమంతం చేశామని చెప్పారు. పేదరిక నిర్మూలన అంశం గతంలో ఎర్రకోట పైనుంచి ప్రసంగాలు, దస్త్రాల రూపకల్పనకే పరిమితమైందని విమర్శించారు.
50 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి:- తమ 12-13 ఏళ్ల పాలనలో దేశంలోని 50 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ఇటీవల ప్రపంచ బ్యాంక్ నివేదిక ఇచ్చిన విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు. తమ ప్రభుత్వ ప్రజోపయోగ నిర్ణయాలవల్లే ఇది సాధ్యమైందన్నారు. తాను సెమీకండక్టర్ మిషన్ గురించి మాట్లాడినప్పుడు చాలామంది ఆలస్యమైందన్నారని చెప్పారు. కానీ ఇప్పుడు సెమీకండక్టర్ రంగంలో మనం ముందున్నామని అన్నారు.
రాబోయే రెండు దశాబ్దాల కాలం విద్యార్థులకు, దేశానికీ ఎంతో కీలకమని ప్రధాని చెప్పారు. కాగా, 1951లో స్థాపించిన ఐఐటీ ఖరగ్‌పూర్‌కు ప్రధాని మోదీ రావడం ఇదే తొలిసారి. ఐఐటీ 75 ఏళ్ల వేడుక సందర్భంగా స్మారక వెండి నాణేన్ని ఆయన ఆవిష్కరించారు. అంతకుముందు ప్రధాని ‘75 వాయిసెస్ ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమం కింద 75 మంది విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ఐఐటీ విద్యార్థుల ఆవిష్కరణలు, స్టార్టప్ అంశాలు, పరిశోధనా నమూనాలను పరిశీలించారు.

