కోనసీమలో గ్యాస్ లీకేజీ నియంత్రణకు ONGC చర్యలు
500 మీటర్ల పరిధిలో ప్రజల తరలింపు..
జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు..
అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ ఘటనను నియంత్రించేందుకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) అత్యవసర చర్యలు చేపట్టింది. మామిడికుదురు మండలం గెడ్డాడ గ్రామం సమీపంలో జాతీయ రహదారి 216 పక్కన ఉన్న గ్యాస్ బావి వద్ద మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బావి వద్ద వర్కోవర్ పనులు జరుగుతున్న సమయంలో గ్యాస్ లీకేజీ జరిగినట్లు ఓఎన్జీసీ వెల్లడించింది.
గ్యాస్ బావి చుట్టూ 500 మీటర్ల పరిధి:- సమాచారం అందిన వెంటనే ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ విపత్తు నిర్వహణ బృందం అప్రమత్తమైంది. అత్యవసర స్పందన బృందం ఘటనా స్థలానికి చేరుకుని భద్రతా చర్యలతో పాటు గ్యాస్ లీకేజీ నియంత్రణ చర్యలు ప్రారంభించింది. విపత్తు నిర్వహణ ప్రణాళికను అమల్లోకి తీసుకొచ్చి, నర్సాపూర్లోని ప్రాంతీయ సంక్షోభ నిర్వహణ కేంద్రాల నుంచి అదనపు సిబ్బంది, పరికరాలు, ఇతర వనరులను తరలించారు. ముందస్తు జాగ్రత్తగా గ్యాస్ బావి చుట్టూ 500 మీటర్ల పరిధిని పూర్తిగా దిగ్బంధించారు. సమీప ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జాతీయ రహదారి 216లో ప్రభావిత ప్రాంతం మీదుగా రాకపోకలను నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు. ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. ముందుజాగ్రత్త చర్యగా నీటి తెరను కూడా ఏర్పాటు చేశారు.
ఓఎన్జీసీ ప్రకటన:- ఘటనా స్థలంలో నిర్వహించిన గ్యాస్ సాంద్రత పరీక్షల్లో పరిశీలించిన ప్రాంతాల్లో గ్యాస్ సాంద్రత సున్నాగా నమోదైనట్లు ఓఎన్జీసీ తెలిపింది. అయినప్పటికీ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. జిల్లా యంత్రాంగం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఓఎన్జీసీ స్థానిక అధికారులు సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సిబ్బంది, స్థానిక ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ గ్యాస్ లీకేజీని సురక్షితంగా, వీలైనంత త్వరగా నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఓఎన్జీసీ తన ప్రకటనలో పేర్కొంది.

