AP&TG

అర్నబ్ తుఫాను నష్టంపై కేంద్ర బృందాలను పంపాలి-హోంమంత్రి అమిత్ షాకు చంద్రబాబు లేఖ

తుఫాను తీవ్రతతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలకు నష్టం..

ప్రాథమిక అంచనా ప్రకారం 70,900 హెక్టార్లలో వరి పంట నీట మునక..

10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం..

28 వేల మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు..

ముందస్తు చర్యలతో ఇప్పటివరకు ప్రాణనష్టం నమోదు కాలేదు..

నరసాపురం సమీపంలో తీరం దాటుతున్న తుపాను…గంటకు 125–135 కి.మీ. వేగంతో ఈదురుగాలులు… పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. భారీ వర్షాలు, వరదలపై హెచ్చరిక…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌పై అర్నబ్ తుఫాను ప్రభావంతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు వీలైనంత త్వరగా కేంద్ర బృందాలను పంపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తుఫాను తీవ్రత కారణంగా రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని లేఖలో పేర్కొన్నారు.

28 వేల మందికి పైగా పునరావాస:- తుఫాను సహాయక చర్యల్లో భాగంగా 14 జిల్లాల్లో 16 ఎన్డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను నియమించినట్లు సీఎం తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 28 వేల మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని వెల్లడించారు. ప్రభుత్వం ముందస్తుగా చేపట్టిన చర్యల కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొన్నారు.

180 ఇళ్లు దెబ్బతిన్నాయి:- ప్రాథమిక అంచనా ప్రకారం 180 ఇళ్లు దెబ్బతిన్నాయని, రహదారులపై 220కి పైగా చెట్లు కూలిపోయాయని సీఎం తెలిపారు. తీర ప్రాంతాల్లో అనేక చోట్ల రహదారులు ధ్వంసమయ్యాయని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని వివరించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టినట్లు వెల్లడించారు.

పంటలకు భారీ నష్టం:- భారీ వర్షాల కారణంగా ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట నీట మునిగిందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటివరకు 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు.కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉందని వివరించారు.

సహాయక చర్యలు ముమ్మరం:- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కంట్రోల్ రూమ్‌లు, రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్‌ కేంద్రం నిరంతరం పనిచేస్తున్నాయని సీఎం తెలిపారు. ప్రజలకు సహాయక చర్యలు అందించడం, విద్యుత్‌, తాగునీటి సరఫరాను పునరుద్ధరించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు.

కేంద్ర బృందాలను పంపించాలి:- తుఫాను నష్టంపై సమగ్ర అంచనా అనంతరం కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని చంద్రబాబు వెల్లడించారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఇతర కేంద్ర సంస్థల సహకారం కొనసాగించాలని కేంద్రాన్ని కోరారు. నష్టాన్ని అంచనా వేసేందుకు వీలైనంత త్వరగా కేంద్ర బృందాలను పంపించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు నిరంతర సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *