AP&TG

2029 నాటికి 100 శాతం గృహ నిర్మాణ లక్ష్యం: సీఎం చంద్రబాబు

3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం..

అమరావతి: ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్  2.0 కింద ఆంధ్రప్రదేశ్‌లో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి బుర్రిపాలెంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 2029 నాటికి రాష్ట్రంలో 100 శాతం గృహ నిర్మాణ లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. తొలుత కేంద్రం రాష్ట్రానికి సాధారణ కోటా కింద 75 వేల ఇళ్లను మాత్రమే మంజూరు చేసిందని, ప్రత్యేక విజ్ఞప్తి మేరకు 3 లక్షల ఇళ్లకు అనుమతి లభించిందని చెప్పారు.

ప్రస్తుత 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపు మరో 3 లక్షల ఇళ్లను, వచ్చే ఏడాది అదనంగా మరో 3 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని సీఎం తెలిపారు. దీంతో రాష్ట్రానికి మొత్తం 9 లక్షల ఇళ్ల కేటాయింపు అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో 2019–2024 మధ్య గృహ నిర్మాణ పథకంలో అవకతవకలు జరిగాయని సీఎం ఆరోపించారు. పేదలకు కేటాయించిన 6 లక్షల ఇళ్లను రద్దు చేశారని, అనువైన ప్రదేశాల్లో కాకుండా చెరువులు, కొండ ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడం వల్ల దాదాపు 4 లక్షల మంది లబ్ధిదారులు వాటిని తిరిగి ఇచ్చారని పేర్కొన్నారు.

3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం:- బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. ఈ సాంకేతికతతో నిర్మించే ఇళ్లలో బయట ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇంటి లోపలి ఉష్ణోగ్రత సుమారు 8 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా 3డీ టెక్నాలజీతో 5,000 ఇళ్లను నిర్మించి, ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు తెలిపారు.

కేంద్రం పూర్తి సహకారం: శివరాజ్ సింగ్ చౌహాన్- కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ప్రస్తుత 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపే మరో 3 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని, అదనంగా మరో 3 లక్షల ఇళ్లను అందిస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్నాయని తెలిపారు. రైతులకు PM-KISAN కింద కేంద్రం ఏడాదికి రూ.6,000, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.14,000 అందిస్తోందని, దీంతో అర్హత కలిగిన రైతులకు ఏడాదికి మొత్తం రూ.20,000 సాయం అందుతున్నట్లు చౌహాన్ వివరించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *