ఏఐ టెక్నాలజీతో ఏపీ టూరిజంలో కొత్త శకం-పర్యాటక మంత్రి కందుల దుర్గేష్
సెప్టెంబర్ 27న రాజమండ్రి వేదికగా..
రాష్ట్రంలోని 130కి పైగా ప్రాంతాల్లో ఏఐ-ఎనేబుల్డ్ ‘నివు’ క్యూఆర్ కోడ్స్..
130 భాషల్లో మాట్లాడే ఏఐ డిజిటల్ గైడ్ ‘నివు’..
అమరావతి: రాజమహేంద్రవరం: AI టెక్నాలజీతో ఏపీ టూరిజంలో సరికొత్త శకానికి నాంది పలుకుతున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సెప్టెంబర్ 27న రాజమహేంద్రవరంలోని మంజీరా కన్వెన్షన్ హాల్ వేదికగా “డిజిటల్ అజెండా,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూ రీడిజైన్ టూరిజం” గ్లోబల్ థీమ్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్థ(ఏపీటీఏ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో జరిగే రాష్ట్ర స్థాయి వేడుకలకు పర్యాటక రంగానికి చెందిన ప్రముఖులు, టూర్ ఆపరేటర్లు, ఆతిథ్య రంగ ప్రతినిధులు, కంటెంట్ క్రియేటర్లు, టెక్నాలజీ ఇన్నోవేటర్లు హాజరుకానున్నారని తెలిపారు. పర్యాటక ప్రచారం, స్టేక్‌హోల్డర్ భాగస్వామ్యం, సాంస్కృతిక,కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమాలతో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపనున్నామని పేర్కొన్నారు.
ఇంటెలిజెంట్ డిజిటల్ గైడ్‌తో నేరుగా:- ఏఐ-ఎనేబుల్డ్ టూరిజంలో అగ్రగామిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ఎక్స్ ప్లర్జర్ (Explurger) సంస్థతో ఇప్పటికే భాగస్వామ్యం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 130కి పైగా పర్యాటక ప్రాంతాలలో ‘నివు’ఏఐ-ఎనేబుల్డ్ క్యూర్ కోడ్‌లను ప్రవేశపెడుతోందన్నారు. కేవలం ఒక స్కాన్ ద్వారా పర్యాటకులు 130కి పైగా భాషల్లో మాట్లాడగల ఇంటెలిజెంట్ డిజిటల్ గైడ్‌తో నేరుగా సంభాషించవచ్చని వివరించారు.తద్వారా పర్యాటకులకు పర్యాటక ప్రాంతాల సమాచారం మరింత సులభంగా, ఆకట్టుకునేలా అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వేడుకల్లో భాగంగా ఏఐ సాంకేతికతతో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నామన్నారు.

