AP&TGDISTRICTS

E-ఫైళ్ల క్లియరెన్స్‌ లో నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు రాష్ట్రంలో ప్రథమ స్థానం

జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను ప్రత్యేకంగా అభినందించిన సీ.ఎం..

కలెక్టర్ వినూత్నంగా చేపట్టిన “పల్లె వీక్షణ”కు సీఎం ప్రశంసలు..

నెల్లూరు: ప్రభుత్వ పరిపాలనలో వేగం, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యతనిస్తూ ఈ-ఫైళ్లను సత్వరమే పరిష్కరించడంలో నెల్లూరు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో రెండో రోజు శుక్రవారం గత మూడు నెలల ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌ పై సమీక్షించగా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లలో నెల్లూరు జిల్లా కలెక్టర్  హిమాన్షు శుక్లా ప్రథమ స్థానంలో నిలినట్లు సీఎం ప్రకటించారు.

కేవలం 5 గంటల 29 నిమిషాలు, 22 సెకన్లు:- 2026 జూన్ 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ మొత్తం 1,492 ఫైళ్లను పరిష్కరించి 100 శాతం డిస్పోజల్‌ రేటును సాధించారు.ఒక్క ఫైలు కూడా పెండింగ్‌లో లేకపోవడం విశేషం. అంతేకాకుండా, ప్రతి ఫైల్‌ను పరిష్కరించేందుకు పట్టిన సగటు సమయం కేవలం 5 గంటల 29 నిమిషాలు, 22 సెకన్లు మాత్రమే కావడం ద్వారా వేగవంతమైన, సమర్థవంతమైన పరిపాలనను చాటింది.

ఈ సందర్భంగా ఈ-ఫైళ్లను వేగంగా పరిష్కరిస్తూ పరిపాలనా సామర్థ్యాన్ని చాటిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు.

కలెక్టర్ వినూత్నంగా చేపట్టిన “పల్లె వీక్షణ”కు సీఎం ప్రశంసలు:జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా వినూత్నంగా చేపట్టిన ‘పల్లె వీక్షణ’ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని, సంబంధిత అధికారుల సమన్వయంతో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ద్వారా పల్లె వీక్షణ కార్యక్రమం ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేస్తోందని ప్రశంసించారు.ఇటీవల పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్‌లోనూ నెల్లూరు జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవగా, తాజాగా ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లోనూ ప్రథమ స్థానం సాధించడం జిల్లా కలెక్టర్ పనితీరుకు మరో నిదర్శనంగా నిలిచింది.ముఖ్యమంత్రి అందించిన ప్రశంసలు, ప్రోత్సాహంతో ఇదే స్ఫూర్తితో మరింత వేగంగా, సమర్థవంతంగా ప్రజలకు సేవలందిస్తూ, జిల్లాను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *