రివ్యూలు కాదు..రిజల్ట్స్ కావాలి..ఆలోచనలతో పాటు..అమలూ ఉండాలి-సీ.ఎం చంద్రబాబు
8వ జిల్లా కలెక్టర్ల సమావేశం..
వన్ స్టేట్-వన్ విజన్-వన్ టీమ్-వన్ మిషన్..
రియాక్టివ్ నుంచి ప్రో యాక్టివ్ దిశగా అధికారులు పనిచేయాలి..
జిల్లాకు 25, నియోజకవర్గానికి 10-15 ప్రాధాన్యతాంశాలను గుర్తించాలి..
మభ్యపెట్టే విధంగా కాదు..వాస్తవ నివేదికలు కావాలి..
కలెక్టర్లు, అధికారులు, మంత్రుల మధ్య పోటీ ఉండాలి..
అమరావతి: శాఖలు, అంశాలపై గంటల తరబడి రివ్యూలు చేయడం కాదు… రిజల్ట్స్ కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను.. అధికారులను నిర్దేశించారు. రాష్ట్ర సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైంది. గురువారం తొలిరోజు సమావేశంలో జిల్లా కలెక్టర్లకు… అధికారులకు వివిధ అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రజా సేవకులుగా ఉందాం… ఈగోలు వద్దు అంటూ కలెక్టర్లకు సూచించారు. గత సమావేశంలో నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టులు ఇక నుంచి తప్పనిసరి కావాలన్నారు. ఓనర్షిప్ తీసుకోగలిగితేనే… లీడర్షిప్ ఇవ్వగలరంటూ అంటూ మంత్రులకు, అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”27 నెలల్లో అనేక వ్యవస్థాగత మార్పులు చేశాం. ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి. 28 కొత్త పాలసీలతో అవకాశాలను అన్ లాక్ చేశాం. రియాక్టివ్ గవర్నెన్స్ నుంచి ప్రో యాక్టీవ్ గవర్నెన్స్‌కు వెళ్లాలి. ఫైల్ పెండింగ్ అంటే అభివృద్ధి పెండింగే. ఫిర్యాదు పెండింగ్ అంటే ప్రజలకు న్యాయం పెండింగ్. విజన్ ఉన్నా.. దాన్ని అమలు చేయకుంటే… అవి నెరవేరని ఆశలుగానే మిగిలిపోతాయి. ఇప్పుడు కాలం మారింది… పనిచేస్తేనే సరిపోదు.. ఫేక్ ప్రచారాలకు కౌంటర్ కూడా ఇవ్వాలి. ఫేక్ ప్రచారం చేస్తుంటే లీడ్ తీసుకుని రియాక్ట్ అవ్వాలి. ప్రభుత్వాన్ని మభ్యపెట్టే నివేదికలు వద్దు…వాస్తవాలు చెప్పాలి. రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొత్తంగా 12 గంటలు జరుగుతుంది… ఇది చాలా కీలకం. సమస్యను దాచిపెడితే పెద్దది అవుతుంది… ఓపెన్‌గా చర్చిస్తే పరిష్కారం లభిస్తుంది. సాధారణ పరిపాలన కాదు… ప్రజలు మెచ్చే సుపరిపాలన కావాలి. శాఖలు పోటీ పడాలి. జిల్లాలు పోటీ పడాలి. సెక్రటరీలు పోటీ పడాలి, కలెక్టర్లు పోటీ పడాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకుందాం…బెస్ట్ పాలసీలు అమలు చేద్దాం. వన్ స్టేట్-వన్ విజన్-వన్ టీమ్-వన్ మిషన్… అదే స్వర్ణాంధ్ర.”అని ముఖ్యమంత్రి అన్నారు.

