డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 430 పోస్టుల భారీ కుంభకోణం-మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
దమ్ముంటే సీబీఐ విచారణ వేయాలి..
బహిరంగ చర్చకు లోకేష్, బాబు సిద్ధమా?
బొత్స సత్యనారాయణ సవాల్..
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?
విశాఖపట్నం: రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, రోజుకో కొత్త సమస్యతో సామాన్య, మధ్యతరగతి ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 430 పోస్టుల కుంభకోణం – సీబీఐ ఎంక్వైరీ వేయండి!- దేశంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పరీక్ష రాయకుండా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరిట ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? ముందుగా జీవో ఇచ్చి, ఉద్యోగాలు తమ వాళ్లకు ఇచ్చేసుకున్నాక ఆ జీవోను ఎందుకు రద్దు చేశారు? 430 ఉద్యోగాలను బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నారు. ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి టాప్ ర్యాంక్ ఎలా వచ్చింది? జిల్లాల వారీగా మెరిట్ లిస్టులు ఎందుకు బయటపెట్టలేదు? ఈ కుంభకోణంపై పూర్తిస్థాయి సీబీఐ విచారణ జరిపించాలి. దమ్ముంటే లోకేష్ లేదా చంద్రబాబు నాతో బహిరంగ చర్చకు రావాలి. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి.. కౌన్సిల్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వమంటే సమాధానం చెప్పలేక పారిపోయారు.
అసెంబ్లీలో డీఎస్సీపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే ధైర్యం ప్రభుత్వానికి ఉంటే కౌన్సిల్‌లో ఎందుకు చర్చకు రావడం లేదని నేను ప్రశ్నిస్తున్నాను. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల మెంబర్‌షిప్ రద్దు చేస్తామని స్పీకర్ గా అంటున్నారు. రద్దు చేయమనండి.. ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ప్రజలే న్యాయనిర్ణేతలు. నారా లోకేష్ 50 సార్లు పిలిచినా మేం భయపడం. లోకేష్‌తోనే కాదు.. చంద్రబాబుతో కూడా బహిరంగ చర్చకు నేను సిద్ధం.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాయకుండా ఉద్యోగాలు ఇవ్వడం, జీవోలు రద్దు చేసి మళ్లీ పునరుద్ధరించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిత్యావసర ధరలు పెరుగుతున్నా నియంత్రణ లేదు. తల్లికి వందనం బకాయిలు ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు. పీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణలో మాట్లాడుతున్న కూటమి పార్టీలు ఏపీలో ఎందుకు మాట్లాడటం లేదు? భోగాపురం విమానాశ్రయంలో స్థానికులకు కనీసం 200 ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు. స్థానిక ప్రజల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నాం.. ప్రజల కోసం పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నాం.
విజయసాయిరెడ్డి మాటలపై స్పందించడం టైం వేస్ట్. వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కేఏ పాల్ ఉండేవారు.. ఇప్పుడు ఆయన రెండో వ్యక్తి. అలాంటి మాటలపై మాట్లాడటం అనవసరం. ఉత్తరాంధ్ర కీలక నేత జనసేనలోకి వెళ్తున్నారన్న ఆయన మాటలపై స్పందించాల్సిన అవసరం కూడా లేదు. 200 మంది విశాఖ ఎయిర్ పోర్టులో స్థానిక ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడం అన్యాయం. స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలకు బాధ్యత లేదా? విశాఖ ఎయిర్‌పోర్టు ఉద్యోగులను కూర్చోబెట్టి మాట్లాడే మానవత్వం కూడా లేకుండా పోయింది.
భోగాపురం విమానాశ్రయంలో 50 వేల ఉద్యోగాలని ఊదరగొట్టి, కనీసం స్థానికులకు 200 ఫోర్త్ క్లాస్ ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డ బొత్స… రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను మేం ఆపం, ఎన్నికలను ఎదుర్కొని ప్రజల పక్షాన పోరాడటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

