DISTRICTS

బలిజ భవన్‌ కల్యాణ మండపం ప్రారంబించిన మంత్రి నారాయణ

నెల్లూరు: నెల్లూరు సిటీ నియోజకవర్గం 15వ డివిజన్‌ బాలాజీనగర్‌లో బలిజ, కాపు, తెలగ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన బలిజ భవన్‌ కల్యాణ మండపాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌, టీటీడీ మాజీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం, లతో కలిసి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ పొంగూరు నారాయణ ప్రారంభించారు.సంఘ నాయకులు, సభ్యులు,కాపు నేతలు మంత్రికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. బలిజ భవన్‌ కల్యాణ మండపం ప్రారంభోత్సవానికి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భవన నిర్మాణానికి కృషి చేసిన సంఘ పెద్దలు, దాతలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ భవనం వెనుక దశాబ్దాల చరిత్ర ఉందని గుర్తుచేశారు.1979లో స్వర్గీయ ఎన్‌.జి.కె. మూర్తి, పసుపులేటి రామ్మూర్తి, నక్క బాలకోటయ్య, జి.ఎల్‌. నరసింహారావు, ముత్యాల చంద్రమోహన్‌, పగడాల ప్రభాకర్‌రావు, సిద్ధంశెట్టి రాధాకృష్ణయ్య, పట్నం ఈశ్వరరావు తదితర పెద్దలు భవనం కోసం స్థలాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. 2022లో నూతన కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన డీవీఎస్‌ గిరి బలిజ భవన్‌ నిర్మాణ సంకల్పంతో ముందుకు సాగారని, 2023 సెప్టెంబర్‌ 10న శంకుస్థాపన జరిగిందని చెప్పారు.భవన నిర్మాణానికి తన వంతుగా రూ.55 లక్షలు, చదలవాడ కృష్ణమూర్తి రూ.33 లక్షలు, డీవీఎస్‌ గిరి రూ.18 లక్షలు అందించడంతో పాటు పలువురు కాపు నేతలు, దాతలు సహకరించారని మంత్రి తెలిపారు. కాపు భవన్‌ నిర్మాణానికి కూడా తాను రూ.2 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు చెప్పారు.బలిజ భవన్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను మంత్రి నారాయణ అభినందించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచేందుకు ‘బలిజ భవన్‌ భరోసా’ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.

‘అమృత కలశం’ ద్వారా ప్రతి నెలా నిరుపేద, ఆసరా లేని కుటుంబాలకు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందిస్తున్నారని, ఇప్పటివరకు సుమారు రూ.5 లక్షలతో 250 కుటుంబాలకు సేవలు అందించడం గొప్ప విషయమన్నారు. విద్యలో వెనుకబడటం వల్లే బలిజ యువత అనేక అవకాశాలను కోల్పోతున్నారని మంత్రి పేర్కొన్నారు. పిల్లల చదువులు మధ్యలో ఆగిపోకుండా ఇప్పటివరకు సుమారు రూ.3 లక్షలతో 100 కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం అభినందనీయమన్నారు.మహిళలకు 90 రోజుల పాటు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చి, ఒక్కొక్కరికి రూ.10 వేల విలువైన ఉషా కుట్టు మిషన్‌ను ఉచితంగా అందించడం మంచి కార్యక్రమమని ప్రశంసించారు. ఇప్పటివరకు సుమారు 35 కుటుంబాలకు కుట్టు మిషన్లు అందించారని తెలిపారు.

ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని, అందుకు మంత్రి నారాయణ నిలువెత్తు నిదర్శనమన్నారు. విలువలతో కూడిన రాజకీయాలతో పాటు మంచి పేరు సంపాదించుకున్న నారాయణ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా నిలిచారని పేర్కొన్నారు.కాపులను ఎదగనీయకుండా కొంతమంది అడ్డుకున్నారని, అలాంటి వారి వెనుక కాపులు నిలవడంబాధాకరమన్నారు. వంగవీటి రంగా తర్వాత ఆ స్థాయి చరిష్మా పవన్‌ కల్యాణ్‌కు వచ్చిందని, ఆయన చరిష్మాను తగ్గించేందుకు వైఎస్సార్‌సీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

టీటీడీ మాజీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ తాను నెల్లూరులోనే చదువుకున్నానని, తన కుమారుడు కూడా నెల్లూరులో ఇంజనీరింగ్‌ చదివారని తెలిపారు. స్నేహితులతో విహారయాత్రకు వెళ్లిన సమయంలో తన కుమారుడు ప్రమాదవశాత్తు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని, నెల్లూరుకు రావాలంటే ఆ బాధ గుర్తుకు వస్తుందని భావోద్వేగానికి గురయ్యారు.బలిజ భవన్‌ను అద్భుతంగా నిర్మించారని, భవన్‌ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని చెప్పారు. మంత్రి నారాయణ నిబద్ధత, నిజాయితీ కలిగిన నేత అని, కాపులంతా ఆయనకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి మంత్రి నారాయణ కృషి చేస్తున్నారని,రాష్ట్రంలోని కాపు సమాజానికి ఆయన అండగా నిలవాలని కోరారు. తాను చేసిన సహాయాన్ని కూడా చెప్పుకోవడానికి ఇష్టపడని గొప్ప వ్యక్తి మంత్రి నారాయణ అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కాపు నేతలు ఆరేటి ప్రకాశ్‌, చలమయ్య నాయుడు, సుధాకర్‌, డీవీఎస్‌ గిరి, పసుపులేటి రామ్మూర్తి, చాట్ల నరసింహారావు, డాక్టర్‌ పోకల రవి, కొట్టే రామ్మూర్తి, మహేష్‌, కొట్టే సాయి, బలిజ భవన్‌ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *