జీఐ ట్యాగ్‌తో కుప్పడం పట్టుకు మరింత విశిష్టత-సీఎం చంద్రబాబు
ఉచిత విద్యుత్తు, రూ.25 వేల ఆర్ధిక సాయం..
సీఎంతో ముఖాముఖిలో చేనేత కుటుంబాలు..
అమరావతి: వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్ ద్వారా కుప్పడం పట్టు చీరలకు మరింత విశిష్టమైన గుర్తింపు లభించిందని, జీఐ ట్యాగ్‌తో అమ్మకాలు 30 శాతం మేర పెరిగాయని చేనేత కుటుంబాలు సీఎం చంద్రబాబుకు తెలిపారు. గత ఏడాది చీరాలలో తయారైన కుప్పడం పట్టు తోపాటు అత్యుత్తమ వృత్తి నైపుణ్యానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కడం గర్వకారణమన్నారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతన్న సేవలో పథకాన్ని చీరాల నియోజకవర్గం కొత్తపేటలో ప్రారంభించారు. కొత్తపేట గ్రామంలోని ఓ చేనేత మగ్గం యూనిట్ ను ముఖ్యమంత్రి సందర్శించారు. చేనేత మగ్గం వద్దకు వచ్చిన ముఖ్యమంత్రికి చేనేత యూనిట్ యజమాని బండారు బాలసుబ్రహ్మణ్యం స్వాగతం పలికారు. అనంతరం చేనేత కార్మికులతో సీఎం మాట్లాడారు. కుప్పడం పట్టు చీరల ప్రత్యేకత, సంప్రదాయ నేత వృత్తి నైపుణ్యం, మార్కెట్ పరిస్థితులపై వారితో చర్చించారు. కోవిడ్ కారణంగా నిలిచిపోయిన విస్తరణ పనులను తిరిగి ప్రారంభించ నున్నట్లు తెలిపారు.

