AP&TG

నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జల్ జీవన్ పనుల వేగం పెంచాలి-ఉప ముఖ్యమంత్రి

తీర ప్రాంత తాగునీటికి జల్ జీవన్ భద్రత..

33 లక్షల మందికి దాహార్తి తీర్చే ప్రాజెక్ట్..

రెండు ప్రాజెక్టుల కింద రూ.270 కోట్ల విలువైన పనులు పురోగతి..

400 కిలోమీటర్లకు పైగా పైప్‌లైన్ నిర్మాణం పూర్తి..

నాణ్యత ప్రమాణాలను స్వయంగా పరిశీలిస్తా..

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులు..

అమరావతి: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో జల్ జీవన్ మిషన్ కింద అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా ఆయా జిల్లాల పరిధిలోని తీర ప్రాంత గ్రామాల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 33 లక్షల మందికి దాహార్తి తీర్చే బలమైన సంకల్పాన్ని ఈ ప్రాజెక్టుల ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. నిర్ణీత గడువులోపు ముఖ్యమైన నిర్మాణాలు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ జల్ జీవన్ పనుల వేగం మరింత పెంచాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో చేపట్టిన జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై పవన్ కళ్యాణ్ సమీక్షించారు. ఇన్ టేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లతోపాటు పైప్‌లైన్ల నిర్మాణం వంటి కీలక పనుల పురోగతికి సంబంధించిన వివరాలపై ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.3,050 కోట్లతో చేపట్టిన పనులు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా సాగుతుండడంపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

నాణ్యతాపరమైన తనిఖీలు స్వయంగా నిర్వహిస్తా:- ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ల ద్వారా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, రాష్ట్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి. ముఖ్యంగా నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న తీర ప్రాంత గ్రామాల్లో పనుల వేగం పెంచాలి. అదే సమయంలో నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడవద్దు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడతా. నిర్మాణ పనులకు సంబంధించి నాణ్యతాపరమైన తనిఖీలు స్వయంగా నిర్వహిస్తాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే విధంగా చర్యలు చేపడతామ”న్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *