పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు-జిల్లా రిజిస్ట్రారు M.రవిజోసెఫ్
నెల్లూరు: ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభతరంగా, వేగవంతంగా-పారదర్శకంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు (RSCలు) ఏర్పాటు చేయనున్నదని,ఈ కేంద్రాలు పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో పనిచేస్తూ, ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన సేవలను ఒకేచోట అందించనున్నాయని నెల్లూరు జిల్లా రిజిస్ట్రారు M.రవిజోసెఫ్ ఒక ప్రకటనలో తెలిపారు.
అన్ని అధికారాలు:- ఆస్తుల కొనుగోలు లేదా విక్రయాలు చేపట్టే వారు ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంపు డ్యూటీ స్వీకరణ, ఆస్తి వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయడం వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే పత్రాల తయారీ నుంచి దరఖాస్తు ప్రక్రియ వరకు అవసరమైన అన్ని విధాల సహాయాన్ని ఈ కేంద్రాలు అందిస్తాయి. అయితే, చట్టపరమైన-నిర్ణయాత్మకమైన అన్ని అధికారాలు యథావిధిగా సబ్ రిజిస్ట్రార్ల వద్దనే కొనసాగుతాయి. బయోమెట్రిక్ ద్రువీకరణ, డిజిటల్ సంతకాలు, క్రయవిక్రయదారుల గుర్తింపు నిర్ధారణ, ఆస్తి బదిలీకి తుది ఆమోదం, రిజిస్ట్రేషన్ దస్తావేజుల జారీ వంటి అధికారాలు సబ్ రిజిస్ట్రార్లకే పరిమితం.
ఆన్లైన్లో స్వయంగా సిద్ధం చేసుకునే అవకాశం:- ఈ విధానం ద్వారా ప్రజలకు ఒకేచోట సమగ్ర సేవలు అందుబాటులోకి రావడంతో పాటు, ముందస్తు స్లాట్ బుకింగ్ వల్ల వేచి ఉండే సమయం తగ్గుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగవంతం, పారదర్శకంగా మారడంతో పాటు మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. సాంకేతికత ఆధారిత సేవల ద్వారా రిజిస్ట్రేషన్ వ్యవస్థ మరింత సమర్ధవంతంగా, ప్రజలకు అనుకూలంగా రూపుదిద్దుకోనుంది. పబ్లిక్ డేటా ఎంట్రీ (PDE) సౌకర్యం ద్వారా పౌరులు తమ దస్తావేజులను ఆన్లైన్లో స్వయంగా సిద్ధం చేసుకునే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఎస్కంబ్రెన్స్ సర్టిఫికేట్ (EC), మార్కెట్ విలువ (Market Value) వివరాలు పొందడం, రిజిస్ట్రేషన్ సేవలను వినియోగించుకోవడం వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని ప్రజలు-రిజిస్ట్రేషన్ చేసుకునే కక్షిదారులు అందుబాటులో ఉన్న ఈ సేవలను సద్వినియోగం చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

