పల్లె వీక్షణతో గ్రామాల్లో సమస్యలకు వేగంగా పరిష్కారం-జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు: గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించడమే ‘పల్లె వీక్షణ’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. గురువారం వెంకటాచలం మండల కేంద్రంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి కలెక్టర్ పల్లె వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తొలుత వెంకటాచలం సమీపంలోని వడ్డిపాలెం లో చేపడుతున్న వీబీజీ–రాంజీ ఉపాధి హామీ పనులను పరిశీలించి పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నిర్వహించిన గ్రామసభలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్, ఎమ్మెల్యే ప్రతి సమస్యను విని సంబంధిత శాఖల అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ, సాగునీరు, రహదారులు, వైద్యం, తాగునీరు, గృహ నిర్మాణం, విద్య తదితర అంశాలపై వచ్చిన వినతులను గడువులోగా పరిష్కరించాలని సూచించారు.
ప్రతి అర్జీకి నిర్దిష్ట గడువులో పరిష్కారం:- ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ, పల్లె వీక్షణలో అందిన ప్రతి అర్జీని ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేసి 30 రోజుల్లో పరిష్కరించేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలు కార్యాలయాలకు వచ్చే వరకు వేచి ఉండకుండా అధికారులే గ్రామాలకు వెళ్లి సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

