ప్రజల నుండి ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియపై క్యూఆర్ (QR) కోడ్ ఫీడ్‌బ్యాక్- డిఆర్వో
నెల్లూరు: ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు చేసిన పౌరుల నుండి నేరుగా ఫీడ్‌బ్యాక్ సేకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా “సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్” (Citizen Feedback QR Code) ను అందుబాటులోకి తెచ్చిందని జిల్లా పిజిఆర్ఎస్ నోడల్ అధికారి, డిఆర్వో విజయకుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంపై ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) చీఫ్ గ్రీవెన్స్ ఆఫీసర్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రజల సమస్యల పరిష్కార ప్రక్రియ ఎంత పారదర్శకంగా, సమర్థవంతంగా జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ ఫీడ్‌బ్యాక్ ఎంతో కీలకమని తెలిపారు.
ప్రజలకు విజ్ఞప్తి:- ఫిర్యాదుదారులు తమ సమస్యల పరిష్కారంపై ఉన్న అభిప్రాయాలను పంచుకోవడానికి, సంబంధిత అధికారులు అందుబాటులో ఉంచిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలని కోరారు.
ప్రదర్శన ప్రాంతాలు:- ప్రభుత్వ కార్యాలయాలు, గ్రీవెన్స్ సెంటర్లు, పౌర సేవా కేంద్రాల్లో ఈ క్యూఆర్ కోడ్ డిస్‌ప్లే చేయడం జరుగుతుందన్నారు.
సామాజిక మాధ్యమాలు:- వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా ఈ క్యూఆర్ కోడ్‌ను విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..
ఈ విధానం ద్వారా పౌరుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఫిర్యాదుదారులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ విలువైన అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా డిఆర్వో విజయకుమార్ విజ్ఞప్తి చేశారు.

