AP&TG

చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలి-ఉప ముఖ్యమంత్రి

సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పరిరక్షణ..

పర్యావరణ పరిరక్షణ, ఎకో టూరిజం అభివృద్ధి..

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణను బాధ్యతగా స్వీకరించి, వాటి పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవను పరిరక్షణ నిల్వ’ (కన్జర్వేషన్ రిజర్వ్‌) ప్రాంతంగా గుర్తించే ప్రక్రియలో ముందడుగు వేసినట్టు పేర్కొన్నారు. జీవ వైవిధ్యానికి నిలయమైన కొండకర్ల ఆవను సమగ్రంగా సర్వే చేసి, అక్కడ ఎకో-టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం కొండకర్ల ఆవ చిత్తడి నేలను కన్జర్వేషన్ రిజర్వ్‌ గా ప్రకటించేందుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ( NOC) జారీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అటవీశాఖ ప్రతిపాదనలకు  జలవనరుల శాఖ కూడా ఆమోదం తెలిపింది. సాగునీరు, జలాశయ నిర్వహణ, హైడ్రాలిక్ వ్యవస్థలు-ఇతర ప్రజాప్రయోజన కార్యక్రమాలకు ఎటువంటి భంగం కలగకుండా తగిన రక్షణ చర్యలతో ఈ అనుమతి మంజూరైంది.

జీవ వైవిధ్యానికి నిలయాలు:- ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “శాస్త్రీయ అధ్యయనాలు-క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా రాష్ట్రంలో 950 చిత్తడి నేలలను గుర్తించాం. వాటిని నోటిపై చేయాల్సిన అవసరం ఉంది. తొలి దశలో 16 చిత్తడి నేలల నోటిఫికేషన్ అనుమతుల ప్రక్రియ తుది దశలో ఉంది. చిత్తడి నేలలు అద్భుతమైన జీవ వైవిధ్యానికి నిలయాలని, వాటి పరిరక్షణ ద్వారా భూగర్భ జలాల పునరుద్ధరణ, వరదల నియంత్రణ, జల భద్రత, వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపు సాధ్యమవుతుంది. అలాగే స్థానిక ప్రజల జీవనోపాధుల మెరుగుదలకు కూడా ఇవి దోహదపడతాయి. అందువల్ల చిత్తడి నేలల పరిరక్షణను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణిస్తోంది. అర్హత కలిగిన అన్ని చిత్తడి నేలలను నోటిఫై చేసే ప్రక్రియను సంబంధిత శాఖల సమన్వయంతో వేగవంతం చేయాలి. సంయుక్త సర్వేలు పూర్తి చేసి, చట్టపరమైన అనుమతులను నిర్దిష్ట కాలవ్యవధిలో పొందాలి. అదే సమయంలో ప్రజా ప్రయోజన కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలి.

విధ్వంసక చర్యల పట్ల కఠినంగా:- చిత్తడి నేలలపై జరుగుతున్న ఆక్రమణలు, విధ్వంసక చర్యల పట్ల కఠినంగా వ్యవహరించాలి. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో చిత్తడి నేలల పరిరక్షణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోంది. కొండకర్ల ఆవ అనేక రకాల వలస-స్థానిక పక్షులకు ఆవాసంగా నిలుస్తోంది. జలవనరుల శాఖ సమన్వయంతో ఎకో-టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేసి, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాల”ని అటవీశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *