వయసు పెరుగుతున్న యువకులుగా, ఉత్సాహంగా కనిపిస్తున్నారు-మంత్రి సత్యకుమార్
చిరంజీవి సమయస్ఫూర్తి,సతీశ్‌రెడ్డి సేవాస్ఫూర్తి..
కళా, రక్షణ రంగాలకు వారి కృషి..
చిరంజీవి సినిమాలకు నక్షత్రాలు కట్టా..
హైదరాబాద్: కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి, రక్షణ రంగంలో శాస్త్రవేత్త జి.సతీశ్‌రెడ్డి తెలుగు ప్రజలు గర్వించదగ్గ ప్రముఖులని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. చిరంజీవి తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకోగా, సతీశ్‌రెడ్డి దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసిన మేటి శాస్త్రవేత్తగా నిలిచారని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఆదివారం బీవీ పట్టాభిరామ్ పేరుతో ఏర్పాటు చేసిన తొలి పురస్కారాన్ని సతీశ్‌రెడ్డికి ప్రదానం చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని, సతీశ్‌రెడ్డితో ఉన్న 35 ఏళ్ల అనుబంధాన్ని సత్యకుమార్ గుర్తుచేసుకున్నారు.
చిరంజీవి సినిమాలకు నక్షత్రాలను కట్టేవారిమి:- తాను 15 ఏళ్ల వయసులో బళ్లారిలో పీయూసీ చదువుతున్న సమయంలో చిరంజీవి సినిమా విడుదలైతే థియేటర్ వద్ద పెద్ద నక్షత్రాలను కట్టేవారమని మంత్రి తెలిపారు. ‘కిరాతకుడు’ సినిమా విడుదలైనప్పుడు రాత్రంతా థియేటర్ వద్ద ఉండి నక్షత్రం కట్టామని, ఆ తర్వాత ‘దొంగ మొగుడు’ చిత్రానికీ అదే విధంగా చేసినట్లు గుర్తుచేశారు.
‘‘ఆ సినిమా పేర్లలో కాస్త ప్రతికూలత కనిపించవచ్చు. కానీ చిరంజీవిగారిలో మాత్రం అలాంటి ప్రతికూలత ఏ కోశానా లేదు. ఆయన మంచి మనసున్న మెగాస్టార్’’ అని సత్యకుమార్ వ్యాఖ్యానించారు. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధాప్యం వస్తుందని అంటారని, చిరంజీవి, సతీశ్‌రెడ్డిని చూస్తే మాత్రం రోజురోజుకూ మరింత యువకులుగా, ఉత్సాహంగా కనిపిస్తున్నారని మంత్రి చమత్కరించారు.
కలాం మాటను నిజం చేసిన సతీశ్‌రెడ్డి:- సతీశ్‌రెడ్డితో తనకు విద్యార్థి దశ నుంచి పరిచయం ఉందని సత్యకుమార్ తెలిపారు. సతీశ్‌రెడ్డి ప్రతిభను మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పాతికేళ్ల క్రితమే గుర్తించారని చెప్పారు. ‘‘సతీశ్‌రెడ్డి ఎంతో ప్రతిభావంతుడు. ఒకరోజు దేశానికి శాస్త్రీయ సలహాదారుగా, డీఆర్‌డీవో అధిపతిగా ఎదుగుతారు’’ అని కలాం అప్పట్లో చెప్పిన మాటలను గుర్తుచేశారు. ఒకప్పుడు చిన్న రక్షణ పరికరాలను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న భారత్.. ఇప్పుడు యుద్ధ విమానాలు, క్షిపణులు, ఆధునిక రక్షణ సామగ్రిని స్వదేశంలో తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరిందన్నారు. ఈ మార్పులో సతీశ్‌రెడ్డి పాత్ర కీలకమని చెప్పారు.
కరోనా వేళ దేశానికి అండగా:- కరోనా మహమ్మారి సమయంలో సతీశ్‌రెడ్డి నాయకత్వంలోని డీఆర్‌డీవో దేశానికి అండగా నిలిచిందని మంత్రి తెలిపారు. దేశంలో పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, వెంటిలేటర్లు అందుబాటులో లేని సమయంలో వాటిని స్వదేశంలోనే తయారు చేశారని గుర్తుచేశారు. సతీశ్‌రెడ్డి శాస్త్రవేత్తగానే కాకుండా సామాజిక స్పృహ కలిగిన వ్యక్తని మంత్రి ప్రశంసించారు.

